నర్సాపూర్ : గురుకుల వసతి గృహాల్లో ఉంటున్న విద్యార్థులకు ఎలుకల బాధలు తప్పడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా ఏదో ఒకచోట ఫుడ్ పాయిజన్, కోతుల కరవడం, పాములు కాటేయడం వంటివి చూస్తూనే ఉన్నాం. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం నారాయణపూర్ గ్రామ సమీపంలో గల తెలంగాణ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాల (బాలికలు)లో చదువుతున్న 8 మంది ఇంటర్మీడియట్ విద్యార్థులను ఎలుకలు కరవడం శుక్రవారం కలకలం రేపింది. గురుకుల పాఠశాల వసతి గృహంలో నిద్రిస్తున్న విద్యార్థినుల కాళ్లపై ఎలుకలు దాడి చేసి కరిచాయి.

అలాగే వీరితోపాటు పలువురు విద్యార్థినులకు స్కిన్ ఎలర్జీ రావడం జరిగింది. విద్యార్థులను చికిత్స నిమిత్తం నర్సాపూర్ ఏరియా ప్రభుత్వ దావాఖానకు తరలించి ప్రథమ చికిత్సను అందించారు. ఇంటర్మీడియట్ చదువుతున్న నికిత, జ్యోతి, ఉష, గీతాంజలి, సంధ్య, అశ్విత మరో ఇద్దరు విద్యార్థినిలు ఎలుకల దాడిలో గాయపడ్డారు. ఈ విషయంపై పాఠశాల ప్రిన్సిపాల్ లలితా దేవిని వివరణ కోరగా హాస్టల్లో ఎలుకల బెడద విపరీతంగా ఉందని, రాత్రి సమయంలో తనపై నుంచి కూడా ఎలుకలు పాకుతున్నాయని వెల్లడించారు. ఎలుకలే కాకుండా కోతులు కూడా విద్యార్థులను గీరాయని వెల్లడించారు. ఎలుకలు కరిచిన విద్యార్థులను ప్రభుత్వ దవాఖానకు పంపించి ప్రథమ చికిత్స చేయించామని తెలిపారు. హాస్టల్లో 540 మంది విద్యార్థినిలు విద్యను అభ్యసిస్తున్నారని వారికి సరిపడా సరైన వసతులు లేవని, పడుకోవడానికి సరిపోయినంత స్థలం లేదని, హాస్టల్ పొలాల మధ్య, అటవీ ప్రాంతంలో ఉండడం మూలంగా ఎలుకలు ఎక్కువగా వస్తున్నాయనీ వెల్లడించారు. ఈ ఎలుకల బాధను నేనే అనుభవిస్తున్నానని ఇక విద్యార్థుల సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదని తెలిపారు. నిన్నటి రోజునా పాఠశాల ఆవరణలోకి మూడు పాములు వచ్చాయని వాటిని చంపామని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.