పెద్దఅంబర్‌పేట, జూన్ 9: ఆరుసార్లకు బదులు.. మూడుసార్లు తూకం వేయడంతో రేషన్ దుకాణాల వద్ద కాస్త రద్దీ తగ్గడంతో కార్డుదారులకు ఉపశమనం కలిగింది. ‘మూణ్నెళ్ల బియ్యం.. ఆరుసార్లు తూకం’ శీర్షికన ఈనెల 3న నమస్తే తెలంగాణ ప్రధాన సంచికలో ప్రచురితమైన కథనానికి పౌరసరఫరాల అధికారులు స్పందించారు. రేషన్ దుకాణాల ద్వారా మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యాన్ని గతంలో ఆరుసార్లు తూకం వేస్తుండగా.. దాన్ని ప్రస్తుతం మూడుసార్లు తూకం వేసి అందిస్తున్నారు. గతంతో పోలిస్తే సగం సమయం ఆదా అవుతున్నదని లబ్ధిదారులు చెప్తున్నారు. రేషన్ దుకాణాల వద్ద కొంత లైన్లు తగ్గినా.. మరింత వేగంగా బియ్యం అందించాలని, ఒకేసారి థంబ్, తూకంతో మూడు నెలల బియ్యం ఇస్తే బాగుంటుందని కోరుతున్నారు.
ప్రతినెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల కోటా బియ్యాన్ని ఒకే తూకంలో ఇచ్చేవారు. జూన్ నెల నుంచి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బియ్యం కోటాలను వేర్వేరుగా తూకం వేస్తున్నారు. ఫలితంగా వేర్వేరుగా వేలిముద్రలు పెట్టాల్సి ఉండగా, వేర్వేరు స్లిప్పులు వచ్చేవి. అలా మూడు నెలల బియ్యానికి ఆరుసార్లు తూకం, ఆరుసార్లు వేలిముద్రలు వేయాల్సిన పరిస్థితి. ఆరు స్లిప్పులు చేతిలో పెట్టేవారు. ‘నమస్తే’ కథనానికి స్పందించిన అధికారులు ప్రతినెలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ కోటాలకు ఒకేసారి తూకం వేసేలా వెసులుబాటు కల్పించారు. అంటే జూన్‌కు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల బియ్యం కోటాకు ఒకేసారి వేలిముద్ర తీసుకుని బియ్యాన్ని ఒకేసారి తూకం వేస్తున్నారు.
మూడు నెలలకు సంబంధించిన బియ్యం కోటా కోసం మూడుసార్లు వేలిముద్రలు వేసి, మూడు సార్లు తూకం చేసేలా ఏర్పాట్లు చేయడంతో లబ్ధిదారులకు కొంత ఉపశమనం కలిగింది. అయినప్పటికీ రేషన్ దుకాణాల వద్ద లబ్ధిదారులు బారులు తీరే పరిస్థితి నెలకొన్నది. ఇప్పటికైనా ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఒకేసారి తూకంతో ముణ్నెళ్ల బియ్యం అందించే ఏర్పాట్లు చేయాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
హైదరాబాద్, జూన్ 9(నమస్తే తెలంగాణ): రేషన్ బియ్యం పంపిణీని ఈ నెల 30వ తేదీ వరకు కొనసాగిస్తున్నట్టు పౌరసరఫరాల శాఖ వెల్లడించింది. ఒకేసారి మూడు నెలల బియ్యం పంపిణీ నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. గతంలో మాదిరిగానే ఈ నెల 15వ తేదీ వరకే పంపిణీ ముగుస్తుందనే ప్రచారం వాస్తవం కాదని తెలిపింది. 30వ తేదీ వరకు అన్ని రేషన్ షాపులు తెరిచే ఉంటాయని పేర్కొంది.