మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 25 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట వద్ద ఎస్ఎల్బీసీ సొరంగంలో జరిగిన ప్రమాద ఘటన స్థలానికి మంగళవారం రాత్రి ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, ఎల్అండ్టీ బృందాలు చేరుకొని అక్కడి దృశ్యాలను చిత్రీకరించాయి. సొరంగం లోపల జరిగిన ల్యాండ్ ైస్లెడ్ దృశ్యాలు ఇందులో ఉన్నాయి. ప్రమాదకరమైన పరిస్థితుల్లో ఈ బృందాలు అతి సమీపంలోకి వెళ్లాయి. అయితే అక్కడ చుట్టూ ఉన్న లైనింగ్ ఏ క్షణంలోనైనా కూలడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆ దృశ్యాల్లో కనిపిస్తున్నాయి. పేరుకుపోయిన బురద.. ఉబికి వస్తున్న నీరు ఇవన్నీ చూస్తుంటే ప్రమాద ఘటన ఎంత తీవ్రంగా ఉన్నదో అర్థమవుతున్నది. రెస్క్యూ బృందాలు చివరకు నిస్సహాయ స్థితిలో తిరిగివచ్చాయి. ర్యాట్ మైనర్స్, ఎన్డీఆర్ఎఫ్, మేఘాకు చెందిన నిపుణులు కూడా లోపలికి వెళ్లి టన్నెల్లో బురద ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలు చేపట్టలేమని.. టన్నెల్‌లోని పరిస్థితిని వీడియో చేసి పోస్టుచేశారు. ఇందులో బురద ఎంత మేర చేరిందో టన్నెల్ పైకప్పు వారికి అందుతుండటాన్ని అంచనా వేయొచ్చు.