తిమ్మాపూర్, జనవరి 19 : తెలంగాణకు ప్రపంచ ఖ్యాతి తీసుకురావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విదేశాల్లో పర్యటించి సంస్థలను ఒప్పించి ఈ-కార్ రేస్ నిర్వహిస్తే.. వాటిని నిర్వహించరాని దద్దమ్మ సీఎం రేవంత్‌రెడ్డి అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ విమర్శించారు. పైగా కేటీఆర్‌పై కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఆదివారం కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపల్లిలో నిర్వహించిన బీఆర్ఎస్ పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ-కార్ రేస్ వల్ల ప్రపంచంలో హైదరాబాద్ పేరు మార్మోగిందని, పలు కంపెనీలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టినట్టు తెలిపారు. రాష్ట్రంలో వసూళ్ల కథనే నడుస్తున్నదని, మానకొండూర్ ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణను అందరూ కమీషన్ల నారాయణ అని పిలుస్తున్నారని ఎద్దేవా చేశారు. ఎల్ఎండీ, ఎంఎండీలో నీళ్లు ఉండగానే ఇసుక తోడేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కాంట్రాక్టులు పొందారని విమర్శించారు. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాలు కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు, రాష్ట్ర నాయకులు కేతిరెడ్డి దేవేందర్‌రెడ్డి, ఉల్లెంగుల ఏకానందం తదితరులు పాల్గొన్నారు.