హైదరాబాద్, డిసెంబర్ 25(నమస్తే తెలంగాణ): రేవంత్‌రెడ్డి తెలంగాణకు ముఖ్యమంత్రి కాదు.. బూతులకు బ్రాండ్ అంబాసిడర్ అని మానకొండూర్ మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ఎద్దేవా చేశారు. నీచ బుద్ధి కలిగిన వ్యక్తి మన రాష్ర్టానికి ముఖ్యమంత్రి కావడం దౌర్భాగ్యమంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘ప్రాణాలకు తెగించి ప్రత్యేక తెలంగాణను సాధించి పదేండ్ల పాలనలో రాష్ర్టాన్ని అగ్రగామిగా నిలిపిన ఉద్యమనేత, తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌ను ఉద్దేశించి బజారుభాష మాట్లాడుతావా? అహంకారం తలకెక్కి అడ్డగోలు కూతలు కూసే రేవంత్‌రెడ్డీ.. గుర్తుంచుకో నువ్వు కేసీఆర్ కాలిగోటికి కూడా సరిపోవు’ అంటూ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘పొద్దున లేస్తే పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటూ పిచ్చి ప్రేలాపనలు చేసే నీకే.. మస్తాన్ మటన్షాఫులో పేగులు తీసే, బోటి కొట్టే ఉద్యోగం ఖాళీగా ఉన్నది. రేవంత్ మాట్లాడే భాషకు చిన్నపిల్లలు కూడా భయపడే పరిస్థితి కనిపిస్తున్నది’ అంటూ రసమయి ధ్వజమెత్తారు.
గురువారం తెలంగాణ భవన్లో నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య, బీఆర్ఎస్ సీనియర్ నేతలు ఎర్రోళ్ల శ్రీనివాస్, గోసుల శ్రీనివాస్, అభిలాష్ రంగినేనితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కోస్గి సర్పంచుల సమ్మేళనంలో సీఎం రేవంత్‌రెడ్డి కేసీఆర్‌పై చేసిన అనుచిత వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. కేసీఆర్ హయాంలో కళకళలాడిన పల్లెలు.. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో అధ్వానంగా మారాయని, అందుకే పంచాయతీ ఎన్నికల్లో అధికార పార్టీకి పల్లె జనం చెంపపెట్టులాంటి తీర్పునిచ్చారని స్పష్టంచేశారు.
కానీ సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం గెలిచిన స్థానాలన్నీ కాంగ్రెస్ ఖాతాలో వేసుకొని సంతోషపడుతున్నారని దెప్పిపొడిచారు. కొత్త సర్పంచ్ల సమ్మేళనంలో హుందా గా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి విచక్షణ లేకుండా కేసీఆర్‌పై అక్కసు వెళ్లగక్కడం దుర్మార్గమని నిప్పులు చెరిగారు. సర్పంచ్ల బాధ్యతలు, హక్కుల గురించి సలహాలు చెప్పాల్సిన ముఖ్యమంత్రి.. బజారు భాష మాట్లాడి తెలంగాణ పరువు తీశాడని మండిపడ్డారు.
ఆరు గ్యారెంటీలు, 420 బూటకపు హామీలతో గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి అధికారమదంతో విర్రవీగుతున్నారని రసమయి ధ్వజమెత్తారు. ఉప ఎన్నికల్లో దొడ్డిదారిన గెలిచి జబ్బలు చరుచుకోవడం సిగ్గుచేటని ఆయన మండిపడ్డారు. కోస్గి సభలో బీఆర్ఎస్ను అడ్రస్ లేకుండా చేస్తానని మాట్లాడటం హాస్యాస్పదమని ధ్వజమెత్తారు. ‘రేవంత్‌రెడ్డి.. నెహ్రూ, ఇందిరా వారసత్వమని గొప్పలు చెప్పుకోవడం తప్ప.. ఎక్కడున్నది నీ పార్టీ.. దేశంలో 29 రాష్ర్టాలుంటే నీ పార్టీ అధికారంలో ఉన్నది మూడోచోట్లే. కర్ణాటకలో రేపోమాపో కూలిపోయేలా ఉన్నది.
ఇక తెలంగాణలో నీదే ఆఖరు ప్రభుత్వం’ అంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ అంటే తెలంగాణకు భరోసానిచ్చే, భవిష్యత్తును చూపే పార్టీ అని గుర్తుంచుకోవాలని పేర్కొన్నారు. ఇప్పటికైనా తప్పుడు మాటలు మానుకొని పాలనపై దృష్టిపెట్టాలని హితవు పలికారు. తెలంగాణ ఉద్యమ బుల్లెట్ హరీశ్‌రావు గురించి మాట్లాడే స్థాయి రేవంత్‌రెడ్డికి లేదని స్పష్టంచేశారు. నీకంటే ముందే ఆయన మంత్రి అయ్యాడనే విషయాన్ని గుర్తుంచుకోవాలని, హరీశ్‌రావు వ్యక్తిత్వం చూడాలంటే తలపైకి ఎత్తిచూడాలని చురకలంటించారు.
కేటీఆర్‌పై సీఎం రేవంత్‌రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గమని రసమయి మండిపడ్డారు. ఐటీ మినిస్టర్‌గా తెలంగాణ ఖ్యాతిని పెంచిన ఆయనను ఉద్దేశించి దుర్భాషలాడడం బాధాకరమని, కేటీఆర్‌పై అక్కసుతో అమెరికాలో ఉండేవాళ్లను అవమానిస్తున్నారని ధ్వజమెత్తారు. చీటికిమాటికీ కేటీఆర్‌పై నోరుపారేసుకొనే రేవంత్‌రెడ్డి.. అమెరికాలో ఉంటున్న మీ తమ్ముడు బాత్రూంలు కడుగుతున్నాడా? అని ప్రశ్నించారు. ఆంధ్రా నుంచి అల్లుడిని తెచ్చుకున్న రేవంత్‌రెడ్డి.. కేటీఆర్ ఆంధ్రాలో చదువుకొన్నాడని మాట్లాడడం సిగ్గుచేటన్నారు. తెలంగాణ ఉద్యమబిడ్డలందరికీ తల్లిలాంటి శోభమ్మను పట్టుకొని అనుచిత వ్యాఖ్యలు చేయడానికి నీకు నోరెలా వచ్చింది, నీలాంటి కుసంస్కారికి బుద్ధిచెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని రసమయి హెచ్చరించారు.
సభపెట్టినా, సమీక్ష చేసినా నల్లమల బిడ్డనని గొప్పగా చెప్పుకొంటున్న సీఎం రేవంత్‌రెడ్డి ఆయన పుట్టిన గడ్డకు చేసిందేంటి? అని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ ప్రశ్నల వర్షం కురిపించారు. పొద్దున లేస్తే పిట్టల దొర కంటే హీనంగా మాట్లాడుతూ రాష్ట్రం పరువు తీస్తున్నారని నిప్పులు చెరిగారు. కేసీఆర్ చావును కోరుకోవడం దుర్మార్గమని ధ్వజమెత్తారు. కేసీఆర్‌కు నాలుగుకోట్ల తెలంగాణ ప్రజల దీవెనలు ఉన్నాయని పేర్కొన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకుంటే ప్రజలు నీ చావే కోరుకుంటారని స్పష్టంచేశారు. అభివృద్ధిని పక్కనబెట్టి బూతులతో పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు.
తప్పుడు హామీలిచ్చి ప్రజలను తప్పుదోవ పట్టించి గద్దెనెక్కిన రేవంత్‌రెడ్డి హోదా మరచి సంస్కార హీనంగా మాట్లాడడం బాధాకరమని నకిరేకల్ మాజీ ఎమ్మె ల్యే చిరుమర్తి లింగయ్య మండిపడ్డారు. రెండేండ్లలో బూతులు మాట్లాడడం తప్ప ప్రజలకు చేసిందేమీలేదని ధ్వజమెత్తారు. కేసీఆర్ ఒక్క ప్రెస్‌మీట్‌కే ఇంత భయపడితే ఆయన అసెంబ్లీకి వస్తే ఎదుర్కొనే ధైర్యం ఉన్నదా? అని ప్రశ్నించారు. దమ్ముంటే కేసీఆర్ విసిరిన ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు.
రాష్ట్రంలో రేవంత్, దేశంలో రాహుల్ ఉన్నంతకాలం కాంగ్రెస్ ఎదగడం అసాధ్యమని తేల్చిచెప్పారు. త్వరలోనే తెలంగాణలో హస్తం పార్టీ చీకట్లో కలిసిపోవడం ఖాయమని జోస్యం చెప్పారు. చిల్లరగా మాట్లాడితే ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించా రు. రేవంత్ భాష, వ్యవహారశైలి చూస్తుం టే ఆయన సొంత మనుమడే దారి తప్పే ప్రమాదమున్నదని, ఆ పిల్లాడిని ఆయనకు దూరంగా పెంచాలని సూచించారు.
ముఖ్యమంత్రికి తొండ దోషం ఉన్నదని అందుకే పదే పదే తొండల గురించి మాట్లాడుతుంటారని రసమయి చురకలంటించారు. ఇది తాను చెప్పడం లేదని ఓ జ్యోతిష్యుడు చెప్పారని రేవంత్‌రెడ్డిపై ఆసక్తికర కథ చెప్పారు. ‘తొండలన్నీ కలిసి ఒకరోజు పా క్కుంటపోయి పాత గోడల మీద సమావేశం పెట్టుకున్నయ్. తొండలు మీటింగ్‌లో మా ట్లాడుకుంటుండగా అక్కడికో పెద్ద తొండ (రేవంత్‌రెడ్డి) గోడ దగ్గరికి వచ్చి నిక్కి నిక్కి చూసిందట. అది గోడ మీదినుంచి అటు దుంకాల్నా.. ఇటు దుంకాల్నా? వద్దా అని ప్రయత్నం చేసింది. ఇంతలో ఆ పెద్ద తొండను చూసి ఇదెక్కడిదిరా మన రాజ్యంలకు వచ్చిందని మిగతా తొండలన్నీ ఒక్కసారిగా ఉరికచ్చినయ్. వాటిని చూసి పెద్దతొండ గోడ దూకి ఉరుకుడు వెట్టింది.
ఇగ అవి కూడా పెద్ద తొండ వెంట పడ్డయ్. ఇగ ఇవి ఉరుక.. అది ఉరుక.. ఉరికీఉరికి కొంత దూరంల పెద్ద తొండను దొరకబట్టినయ్. ఓ గుండు మీద కూసోబెట్టినయ్. అరె ఏం సంగతిరా భయ్.. మా ఏరియాకు ఎందుకొచ్చినవ్.. మా పని ఎందుకు చేత్తున్నవ్’ అని అడిగనయ్. ఆ తొండలకేం తెలుసు! పెద్దతొండ(రేవంత్‌రెడ్డి)కి అన్ని పార్టీలు మారు డు అలవాటేనాయె. అందుకే తొండ లెక్కనే ఆ రాత్రి ఏ గోడను దుంకవోయిండో, తొండలన్నీ దొరకబట్టి మా ఏరియాకు ఎందుకువచ్చినవని గట్టిగనే నిలదీసినయ్. ఇగ పెద్దతొండ(రేవంత్‌రెడ్డి) నేను మొన్ననే ముఖ్యమంత్రి అయిన అని చెప్పింది.
అయినా తొండలు వినలే.. నీ సంగతి చూస్తమని చెప్పి ఒకటి ఈ జేబుల, ఇంకోటి ఆ జేబుల, కింద ఒకటి, ఇట్లు ఒకటెనుక ఒకటి మీద జొర్రినయ్. దీనికి జడుసుకున్న పెద్దతొండ (రేవంత్‌రెడ్డి) జర మీ దయ.. నేను కొత్తగా సీఎం అయిన 4రోజులు అవకాశమివ్వమని అడిగిండట. ఇస్తే మాకేమిస్తవని ఆ తొండలు అడిగినయ్. ఏంలేదు.. నేను పేరుకే సీఎంని, అధికారమంతా మీదే.. మీ పేరు చెప్పుకుంటనే బతుకుతా. ఎక్కడ సభ పెట్టినా మీ పేరే తలుచుకుంట’ అని తొండలకు హామీ ఇ చ్చిండట. ‘అందుకే సీఎం ఎక్కడ సభ పెట్టి నా తొండ.. తొండ అని తలుస్తుంటడు.. తొండ పేరు ఎత్తకుండా, తొండి భాష మా ట్లాతున్నారు అని రసమయి ఎద్దేవా చేశారు.