Rangareddy | పోక్సో కేసు పెట్టారనే కక్షతో రంగారెడ్డి జిల్లా షాబాద్‌లో జరిగిన ఆరుగురి హత్యల కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. మైనర్ బాలికను నిందితుడు రాజ్‌కుమార్ బలవంతంగా ఇంటి నుంచి కారులో తీసుకెళ్తున్న దృశ్యాలు బయటకొచ్చాయి. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ ఇప్పుడు సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దైవాలగూడకు చెందిన పార్వతి రాజ్‌కుమార్‌పై మే 16వ తేదీన పోక్సో కేసు నమోదైంది. మైనర్ బాలిక (17)ను వేధించాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు మే 26వ తేదీన అరెస్టు చేసి జైలుకు పంపించారు. అయితే శుక్రవారం అతను జైలుపై విడుదలయ్యాడు. ఈ క్రమంలో రాత్రి 11 గంటల సమయంలో మైనర్ బాలిక ఇంటికి వెళ్లాడు. షాబాద్ పీఆర్ఆర్ స్టేడియం సమీపంలోని మైనర్ బాలిక (17) ఇంట్లోకి ప్రవేశించి, ఆమెను బలవంతంగా లాక్కెళ్లే క్రమంలో బాలిక తల్లి లక్ష్మీ, నాయనమ్మ రుక్కమ్మ అడ్డుపడ్డారు. దీంతో వారిద్దరినీ కత్తితో పొడి చంపాడు. అనంతరం బాలికను దైవాలగూడ సమీపంలోని చెరువు దగ్గరకు తీసుకెళ్లి పీకకోసి హత్య చేశాడు.

Rangareddy Murder1
శనివారం తెల్లవారుజామున ఒంటి గంట ప్రాంతంలో తన ఇంటికి వెళ్లిన రాజ్‌కుమార్.. కట్టుకున్న భార్య సరిత (33)తో పాటు ఇద్దరు కుమారులు పరీక్షిత్(4), దైవీక్షిత్(2)లను కత్తితో పీకలు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి అందర్నీ చంపేశానని.. తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని రాజ్ కుమార్ చెప్పాడు. అనంతరం ఫోన్ స్విచ్ఛాప్ చేశాడు. దీంతో అరుణ్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు హత్యకు ఉపయోగించిన ఆయుధాన్ని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చేపట్టారు. కాగా, పోలీసుల నిర్లక్ష్యం కారణంగా ఈ ఆరు హత్యలు జరిగాయని స్థానికులు ఆరోపిస్తున్నారు.