HYDRAA | హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నవంబరు 21(నమస్తే తెలంగాణ): దశాబ్దాలుగా హైదరాబాద్ తాగునీటి వనరులైన హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్ జలాశయాల పరిధిలోని పెద్ద ఎత్తున ఆక్రమణలు జరిగాయి. ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైడ్రా కొన్ని కట్టడాలను కూల్చింది. కానీ జలాశయాల పరిధిలోని బడాబాబుల భవంతుల జోలికి వెళ్లలేదు. పేదలకు ఓ న్యాయం, పెద్దలకు మరో న్యాయమా అంటూ సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ శనివారం జంట జలాశయాల పరిధిలో పర్యటించేందుకు సిద్ధమయ్యారు. ఆక్రమణలపై హైడ్రా కమిషనర్ ఎలాంటి చర్యలు చేపడుతారో అని స ర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
వీటినేం చేద్దాం?
జల వనరుల పరిధిలోని ఆక్రమణల తొలగింపే ప్రభుత్వ ధ్యేయమని సీఎం రేవంత్‌రెడ్డి పలు వేదికలపై చెబుతున్నారు. ఆచరణలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉదాహరణకు జలాశయాలకు 500 మీటర్ల మేర నిర్మాణాలు ఉండొద్దనే గతంలోనే పురపాలకశాఖ ఉత్తర్వులు ఇచ్చింది. కానీ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి గృహం గండిపేట పరిధిలోనే ఉన్నది. శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి, కాంగ్రెస్‌కు చెందిన ఓ ఎంపీ భాగస్వామిగా ఉన్న శ్రీనిధి విద్యా సంస్థల భవన సముదాయం, కాంగ్రెస్ సీనియర్‌నేత కేవీపీ రామచంద్రరావుతో పాటు చాలా మంది ప్రముఖుల నిర్మాణాలు ఎఫ్టీఎల్, బఫర్‌జోన్ పరిధిలో ఉన్నాయి. జలమండలి నిర్వహించిన సర్వేలోనూ ప్రముఖుల నిర్మాణాలు నిబంధనలకు విరుద్దంగా ఉన్నాయని తేలింది.
చూసేందుకా.. కూల్చేందుకా?
గండిపేట పరిధిలో సర్వే చేసిన జలమండలి, నీటిపారుదల, రెవెన్యూశాకలు ఆక్రమణల జాబితాను సిద్ధం చేశాయి. ఏయే భవనాలు ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఉ్ననాయో నిర్ధారించాయి. ఆగస్టు 18న గండిపేట ఎఫ్టీఎల్లో ఉన్నాయంటూ పలు నిర్మాణాలను హైడ్రా కూల్చివేసింది. ఆ తర్వాత పెద్దల భవనాలు ఎందుకు కూల్చడం లేదని పలువురు ప్రశ్నించారు. కానీ హైడ్రా అధికారులు అటువైపు చూడలేదు. కానీ శనివారం జంట జలాశయాలను హైడ్రా కమిషనర్ రంగనాథ్ పరిశీలిస్తారని అధికారవర్గాలు వెల్లడించాయి. ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతున్న నేపథ్యంలో ఆక్రమణలుగా ఉన్న పెద్దల బంగ్లాలను చూడడానికి వెళ్తున్నారా? లేకపోతే కూల్చుతారా? అని చర్చ జరుగుతున్నది. జలాశయాలు కలుషితం కాకుండా తీసుకునే చర్యలు, అభివృద్ధి, బాపూ ఘాట్ వద్ద గాంధీ భారీ విగ్రహ ఏర్పాటు ప్రణాళికలను పరిశీలిస్తారని తెలుస్తున్నది.