హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 22 (నమస్తే తెలంగాణ): పేదల ఇండ్లు కూల్చి పెద్దోళ్ల కబ్జాలను ఎందుకు వదిలేశారంటే ఒక కహానీ, సల్కం చెరువు మధ్యలో కట్టిన ఎంఐఎం నేతల కాలేజీని ఎందుకు కూల్చడం లేదంటే మరో కహానీ, గండిపేట చెరువులో ఇప్పటికీ అక్రమ నిర్మాణాలు, కన్వెన్షన్లు ఉన్నాయని, రెండు రోజుల కిందటే ఫంక్షన్‌కు కూడా వెళ్లానని చెప్తే.. ‘చూపించండి, తెల్లారేసరికి కూల్చేస్తా’ అంటూ గద్దింపులు, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి ఇల్లు ఉన్నది కదా? అంటే అది ఎఫ్టీఎల్లో లేదంటూ కవరింగ్, హిమాయత్ సాగర్ ఎఫ్టీఎల్ గురించి ప్రస్తావిస్తే.. ‘డాటా ఇంకా రాలేదు’ అంటూ బుకాయింపు.. ఓ ఛానల్ ఇంటర్వ్యూలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చేసిన విచిత్ర విన్యాసాలివి! ఆయన సమాధానాలపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా ఐఏఎస్ అధికారి అయ్యుండి కులసంఘాల సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారు? అని ప్రశ్నిస్తే ‘కులగజ్జి వద్దు అని చెప్పడానికి కులసంఘం సమావేశానికి వెళ్తున్నా’ అని సర్దిచెప్పడం హైలెట్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఎన్ని కూల్చారో ఆయనకే తెలియదా?
హైడ్రా ఏర్పాటైన తర్వాత ఇప్పటివరకు ఎన్ని ఇండ్లు కూల్చారో కమిషనర్‌కు తెలియకపోవడం గమనార్హం. ఇప్పటివరకు 30 వేల మంది రోడ్డున పడ్డారని యాంకర్ చెప్పగా.. రంగనాథ్ మాత్రం 300 ఇండ్లే కూల్చామని, 150లోపే ఉంటాయని పొంతన లేని సమాధానం చెప్పారు. ఎన్ని కూల్చామో కచ్చితమైన సంఖ్య త్వరలో చెప్తానన్నారు. పైగా ప్రభుత్వం నుంచి అనుమతులు తీసుకున్న ఇండ్లను కూల్చలేదని, దొంగ పర్మిషన్లు తీసుకున్న ఇండ్లనే కూల్చామని సర్దిచెప్పుకొన్నారు. వాస్తవానికి అన్ని అనుమతులూ ఉన్న ఇండ్లను కూడా హైడ్రా కూల్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత వాటికి తప్పుడు అనుమతులు ఇచ్చారంటూ నీటిపారుదల, రెవెన్యూ, మున్సిపల్ అధికారులపై కేసుల నమోదుకు సిఫార్సు చేసింది. అంటే ప్రభుత్వం అనుమతులిచ్చినట్టే కదా? ఒక నిరుపేదకు, కష్టపడి పైసా పైసా కూడబెట్టి సొంతింటి కల నెరవేర్చుకొనే మధ్యతరగతివాళ్లకు, రేయింబవళ్లు శ్రమించిన సొమ్ముతో ఇండ్లు, విల్లాలు కొనుగోలు చేసే ఉద్యోగులకు సంబంధిత శాఖల నుంచి వచ్చిన అనుమతులే ప్రామాణికం. దాని ఆధారంగానే నిర్మాణాలు చేయడమో, ఇండ్లు కొనుగోలు చేయడమో చేస్తుంటారు.
కానీ హైడ్రా వచ్చి వాటిని కూల్చివేసి, అవి తప్పుడు అనుమతులు అని చెప్తే వారి పరిస్థితి ఏమిటో మాత్రం రంగనాథ్ వివరించలేదు. ఇది ప్రభుత్వ లోపం కదా?, పేదవాడిని ఎందుకు రోడ్డు పడేస్తున్నారు? అని ప్రశ్నించగా.. ఇద్దరిదీ తప్పు అని చెప్తూనే, క్షేత్రస్థాయిలో విచారణ చేయాలని ఉచిత సలహా ఇచ్చారు. ‘హైడ్రా కూల్చేసిన తర్వాత లేని ఇంటికి కూడా ఈఎంఐ కడుతున్నవారు ఉన్నారు. మరి హైడ్రా దొంగ పర్మిషన్లు ఇచ్చిన అధికారుల్లో ఒక్కరిపైనైనా ప్రభుత్వం చర్యలు తీసుకుందా?’ అని బాధితులు ప్రశ్నిస్తున్నారు. జూలై 2024లో హైడ్రా ఏర్పాటు తర్వాత మొదటి రెండు మూడు నెలలు చాలా తప్పులు జరిగాయని రంగనాథ్ ఒప్పుకొన్నారు. వాటి విషయంలో జరిగిన తప్పులు తెలుసుకుని పరివర్తన చెందామన్నారు. కబ్జా పేరుతో ఇంట్లో పుస్తకాలు కూడా తీసుకునే అవకాశం ఇవ్వకుండా కుటుంబ సభ్యులను బయటికి గెంటేసి, ఇల్లు కూల్చేసిన ఘటనలో కానిస్టేబుల్‌ను మందలించామని చెప్పారు. ఈ విషయాన్ని ఇంత తేలికగా చెప్పడంపై బాధితులు మండిపడుతున్నారు. తమను కట్టుబట్టలతో గెంటేసినవారిని మందలింపుతోనే సరిపెడుతారా? అని ప్రశ్నిస్తున్నారు.
సల్కం చెరువుపై సమాధానం లేదు
పాతబస్తీలోని సల్కం చెరువు మధ్యలో ఎంఐఎం నేతలు నిర్మించిన కాలేజీని ఎందుకు కూల్చడం లేదని యాంకర్ ప్రశ్నించారు. దీనికి ఎలా సమాధానం ఇవ్వాలో తెలియక రంగనాథ్ కొత్త కహానీ వినిపించారు. తాము పార్టీని చూడటం లేదని, బమృకున్ ఉద్ దౌలా చెరువులో జరిపిన కూల్చివేతల్లో ఎంఐఎం నేతలకు చెందిన నిర్మాణాలు, వెంచర్లే ఉన్నాయని చెప్పారు. సల్కం చెరువు నిర్మాణంపై మళ్లీ ప్రశ్నించగా, ‘చెరువు చుట్టూ బస్తీలున్నాయి. బస్తీలు కూల్చవద్దని ప్రభుత్వం పాలసీ నిర్ణయం తీసుకుంది’ అంటూ కాలేజీ గురించి చెప్పకుండా దాటేశారు. ఎంఐఎంకు చెందిన చిన్న నేతలు, కార్యకర్తల నిర్మాణాలను కూల్చివేసి, పెద్ద నేతల నిర్మాణాలను మాత్రం ఎందుకు ముట్టుకోవడం లేదని యాంకర్ ప్రశ్నించగా మళ్లీ బమృకున్ ఉద్ దౌలా చెరువు కథనే చెప్పారు.
ఈ నిర్మాణాలు కనిపించడం లేదా?
రంగనాథ్ ఇంటర్వూపై సోషల్ మీడియాలో విమర్శలు, ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి భట్టి విక్రమార్క సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. హైదరాబాద్ పరిధిలో 11 నిర్మాణ సంస్థలకు చెందిన సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు అక్రమంగా, చెరువుల ఎఫ్టీఎల్, బఫర్జోన్లలో నిర్మిస్తున్నారని భట్టి చెప్పారని తెలిపారు. మరి ఆ నిర్మాణాల జోలికి హైడ్రా ఎందుకు వెళ్లలేదని ప్రశ్నిస్తున్నారు. సచివాలయంలో అధికారికంగా ప్రాంతాలు, మ్యాపులు, ఫొటోలతో సహా అక్రమ నిర్మాణాల చిట్టాను వెల్లడించారని, హైడ్రాకు ఇంతకంటే సాక్ష్యం ఏం కావాలి? అని నిలదీస్తున్నారు. 200-300 మంది సామాన్యుల ఇండ్లు కూలగొడితేనే రూ.60 వేల కోట్ల ప్రభుత్వ ఆస్తులు కాపాడినట్లయితే, బడా బాబుల నిర్మాణాలను కూలగొడితే రూ. లక్షల కోట్ల ప్రజల ఆస్తిని కాపాడినట్టు అయ్యేది కదా? మరి ఎందుకు కూల్చడం లేదు? అని అడుగుతున్నారు. కూల్చివేతలతో ప్రజల్లో అవగాహన వచ్చిందని చెప్పడంపైనా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
‘పోలీసులు ఎంత అవగాహన కల్పించినా పండుగల సమయంలో దొంగతనాలు జరుగుతూనే ఉన్నాయి. ఆ ఇండ్ల యజమానులను బహిరంగంగా శిక్షిస్తే ఇతరుల్లో అవగాహన వస్తుందని అనుకుంటే అది మూర్ఖత్వమా? కాదా?’ అని ప్రశ్నిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్‌ను కూల్చామని పదే పదే చెప్పుకోవడంపైనా నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఎన్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హీరో నాగార్జున తన భూమిని చెరువు అభివృద్ధికి ఇచ్చి నష్టపరిహారం తీసుకున్నారని సీఎం రేవంత్‌రెడ్డి పలుసార్లు చెప్పారని, ఇదే తరహాలో ఇతర కూల్చివేతల బాధితులకు ఎందుకు పరిహారం వర్తింపజేయడం లేదని ప్రశ్నిస్తున్నారు. ‘ప్రభుత్వ భూముల్ని కబ్జా చేసుకుంటూ పోతే ఊరుకుందామా?’ అని యాంకర్‌ను రంగనాథ్ ఎదురు ప్రశ్నించారు. దీనిపై నెటిజన్లు స్పందిస్తూ ‘ఖాజాగూడలో ప్రభుత్వానికి చెందిన రూ.3 వేల కోట్ల విలువైన సుమారు 30 ఎకరాల భూమిలో ఒక నిర్మాణ సంస్థ బహుళ అంతస్తుల భవనాలు నిర్మిస్తున్నది. అధికార పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు బహిరంగంగా ఫిర్యాదు చేశారు. న్యాయస్థానం తలుపు కూడా తట్టారు. అయినా హైడ్రా అటువైపు ఎందుకు కన్నెత్తి చూడలేదు’ అని ప్రశ్నిస్తున్నారు. నలుగురు అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఫిర్యాదు చేసినా, ఖాజాగూడ వైపు హైడ్రా బుల్డోజర్ ఎందుకు కదలదని నిలదీస్తున్నారు.
‘ప్రజలను భయపెట్టాల్సిందే’
సివిల్ సర్వెంట్‌గా ఉండి కుల సమావేశాలకు ఎందుకు వెళ్తున్నారని యాంకర్ ప్రశ్నించగా.. దేశంలో కులం అనేది ఉన్నదని, దాన్ని మన నుంచి ఎవరూ వేరుచేయలేరని రంగనాథ్ చెప్పారు. కుల సమావేశాలకు వెళ్లి కులగజ్జి ఉండకూడదని, చదువుకోమని మంచి మాటలు చెప్తానన్నారు. కులసంఘ సమావేశానికి వెళ్లి కులగజ్జి ఉండకూడదని ఎలా చెప్తారని యాంకర్ ప్రశ్నించగా రంగనాథ్ సమాధానం దాటవేశారు. హైడ్రా కూల్చివేతలు మొదలైన తర్వాత చెరువుల ఆక్రమణ దాదాపుగా ఆగిపోయిందని, ఎవరైనా చెరువులో వెంచర్లు వేసినా కొనే పరిస్థితి లేదని రంగనాథ్ గొప్పగా చెప్పుకొన్నారు. దీనిపై యాంకర్ స్పందిస్తూ ప్రభుత్వమంటే ప్రజలకు భరోసా కల్పించాలేగానీ, భయపెడితే ఎలా? అని ప్రశ్నించగా భయపెట్టి రూల్ పాటించేలా చేశామని వ్యాఖ్యానించారు. చెరువులను ఆక్రమిస్తున్న పేదల వెనుక పెద్దలు ఉన్నారని, నిర్మాణాలు కూల్చివేయడం ద్వారా వారి నల్లధనాన్ని బ్లాక్ చేయగలుగుతున్నామని, తద్వారా ఎన్నికల్లో ధన ప్రవాహం అరికట్టగలుగుతున్నామంటూ పొంతన లేని సమాధానం ఇచ్చారు.