హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ): సీఎం రేవంత్‌రెడ్డి ఫ్రస్ట్రేషన్లో రోత మాటలు మాట్లాడారని బీఆర్ఎస్ సీనియర్ నేత గట్టు రామచందర్‌రావు ధ్వజమెత్తారు. గురువారం తెలంగాణ భవన్లో పార్టీ నేత గౌతమ్ప్రసాద్తో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ ప్రెస్‌మీట్‌తో హడలెత్తిపోయి రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన మాట్లాడడం దుర్మార్గమని మండిపడ్డారు. తెలంగాణను సాధించిన మహానేత చావు కోరుకోవడం రేవంత్ దిగజారుడుతనానికి అద్దం పడుతున్నదని దుయ్యబట్టారు.
తల్లిని గౌరవించాలనే ఇంగిత జ్ఞానం ముఖ్యమంత్రికి లేకపోవడం దురదృష్టకరమన్నారు. ఓడిపోగానే కేసీఆర్ మూలనపడ్డారని అవమానించడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. కేటీఆర్, హరీశ్‌రావుపై బాడీ షేమింగ్ వ్యాఖ్యలు బాధాకరమని.. అనేకసార్లు కాంగ్రెస్ పార్టీ ఓటమిలో భాగమైన రాహుల్‌గాంధీని అద్దంలో ముఖం చూసుకోవాలని చురకలంటించారు. పంచాయతీ ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించామని విర్రవీగుతున్న రేవంత్‌రెడ్డి.. దమ్ముంటే పరిషత్ ఎన్నికలు పెట్టాలని సవాల్ విసిరారు.
అడ్డదిడ్డంగా మాట్లాడితే ప్రజాక్షేత్రంలో తగిన గుణపాఠం తప్పదని హెచ్చరించారు. ఇప్పటికైనా కండ్లు తెరిచి పాలనపై దృష్టిపెట్టాలని డిమాండ్ చేశారు. బాధ్యాతయుతమైన పదవిలో ఉన్న రేవంత్‌రెడ్డి బూతులు మాట్లాడడం సిగ్గుచేటని గౌతంప్రసాద్ ధ్వజమెత్తారు. తెలంగాణ పౌరుషం గురించి మాట్లాడే హక్కు రేవంత్‌కు లేదని తేల్చిచెప్పారు. ఆయన మాట్లాడిన ప్రతి మాటనూ తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు. ఇకనైనా మారకుంటే ఆయన, ఆయన పార్టీని పాతాళంలోకి తొక్కడం ఖాయమని స్పష్టంచేశారు.