హైదరాబాద్, ఏప్రిల్ 19 (నమస్తే తెలంగాణ) : ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా తీసుకుంటున్న నిర్ణయాలు దేశ ప్రజాస్వామిక వ్యవస్థను ధ్వంసం చేసేలా ఉన్నాయని సీపీఐ జాతీయ కార్యదర్శి రామకృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. వారిద్దరూ రాజ్యాంగ విరుద్ధమైన చర్యలకు పాల్పడుతూ దేశానికి, రాష్ట్రాలకు తీరని అన్యాయం చేస్తున్నారని, ఎన్డీఏ కూటమిలో కీలకంగా ఉంటూ ఈ అన్యాయాన్ని బలపరుస్తున్న ఏపీ సీఎం చంద్రబాబు, జెడీయూ నేత నితీశ్ కుమార్ ‘ఎక్స్ట్రా ప్లేయర్లు’గా నిలిచిపోయారని రామకృష్ణ విమర్శించారు. విజయవాడలోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడుతూ.. మహిళా రిజర్వేషన్ల బిల్లుకు విపక్షాలు అడ్డపడుతున్నాయని మోదీ చేసిన వ్యాఖ్యల్లో నిజం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ల బిల్లుతోపాటు నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కలిపి ప్రవేశపెట్టడం వల్లే విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశాయన్నారు.
పకా రాజకీయ ప్రయోజనాల కోసమే మహిళా బిల్లును మోదీ వాడుకుంటున్నారని ధ్వజమెత్తారు. 2023 సెప్టెంబర్‌లోనే ఆమోదం పొందిన మహిళా రిజర్వేషన్ల చట్టాన్ని ఎవరైనా అడ్డుకోవడం సాధ్యమా? అని ప్రశ్నించారు. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నితీశ్ కుమార్, చంద్రబాబు అండతోనే నిలబడుతున్నదని, దీంతో డీలిమిటేషన్లో దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందన్నారు. దీనిపై అన్ని రాష్ట్రాల నేతలు కేంద్రాన్ని నిలదీసినప్పటికీ చంద్రబాబు, నితీశ్ కుమార్ మౌనం వహించడం సిగ్గుచేటని, కీలక విషయాల్లో స్పష్టమైన వైఖరి తీసుకోకపోతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. డీలిమిటేషన్‌పై బాబుతోపాటు వైసీపీ అధినేత జగన్, పవన్ కల్యాణ్ స్పష్టమైన అభిప్రాయం వ్యక్తం చేయడం లేదని మండిపడ్డారు.