కోల్ సిటీ, అక్టోబర్ 7: నమస్తే తెలంగాణ కథనంకు స్పందించి రామగుండం నగర పాలక సంస్థ రంగంలోకి దిగింది. రోడ్లపై తిరుగుతున్న పశువులను బంధించి.. గోశాలకు తరలించింది. ఈమేరకు నమస్తే తెలంగాణ దినపత్రికలో ‘ ప్రకటనలకే పరిమితమా.. రోడ్లపై యథేచ్ఛగా తిరుగుతున్న పశువులు..’ శీర్షికన సోమవారం ప్రత్యేక కథనం ప్రచురితమైంది. దీనితో నగర పాలక సంస్థ కమిషనర్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జే.అరుణ శ్రీ తీవ్రంగా స్పందించారు. వెంటనే రోడ్లపై తిరుగుతున్న పశువులను గోశాలకు తరలించే చర్యలను పటిష్టం చేయాలని అధికారులను ఆదేశించారు. దాంతో సోమవారం రాత్రి హ్యాండ్స్ టూ సర్వ్ ఫౌండేషన్ ఎనిమల్ రెస్క్యూ టీం సభ్యులతో కలిసి నగరంలో గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
రోడ్లపై తిరుగుతున్న పశువులను పట్టుకొని సంజయ్ గాంధీనగర్ లో గల గోశాలకు తరలించారు. ఈ పశువుల యజమానులు నగర పాలక కార్యాలయంలో సంప్రదించి రూ.4 వేల జరిమానాతోపాటు గోశాల నిర్వహణకు రోజుకు రూ.200ల చొప్పున చెల్లిస్తే పశువులను అప్పగిస్తామని స్పష్టం చేశారు. అలాగే నగరంలోని మురికివాడల్లో తిరుగుతున్న పందుల బెడద నివారణకు సైతం చర్యలకు ఆదేశించారు. దీనితో మంగళవారం తెల్లవారు జామున యజమానులు అప్రమత్తమై పందులను పట్టుకొని నగరంకు దూర ప్రాంతానికి తరలించారు. ఈ చర్యల పట్ల నగర ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.