హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : తెలంగాణలో ఫిరాయింపుదారులు రాజకీయ విలువలను తుంగలో తొక్కుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు మండిపడ్డారు. గురువారం పార్టీ రాష్ట్ర కార్యాలయంలో దివంగత ప్రధాని వాజ్‌పేయీ 101 జయంతి ఉత్సవాలను నిర్వహించారు. ఈ సందర్భంగా రామచందర్ రావు మాట్లాడుతూ వాజ్‌పేయీ పార్లమెంట్లోగానీ, బయటగానీ ఎప్పుడూ నోరుజారి మాట్లాడలేదని చెప్పారు.
సీఎం రేవంత్‌రెడ్డి ప్రతీకార భావనతో మాట్లాడటం బాధాకరమని తెలిపారు. కాంగ్రెస్ సర్కార్ కృత్రిమ మేధను ఉపయోగించి ప్రచారం చేసుకోవడం తప్ప రాష్ట్రంలో చేసిందేమీలేదని విమర్శించారు. ‘తెలంగాణ రైజింగ్’ అంటూ ప్రచారం చేస్తున్నా.. రాష్ట్రంలో పెట్టుబడులు, కంపెనీలు కనిపించడం లేదని ఎద్దేవా చేశారు. సీఎం సహా మంత్రులు దావోస్‌కు వెళ్లినా, ఒక్క పెద్ద కంపెనీ నుంచి పెట్టుబడులు తీసుకురాలేకపోయారని దుయ్యబట్టారు.