TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ సజ్జనార్ తెలిపారు. ఈ నెల 9న రాఖీ పండుగ రోజున 45.62 లక్షల మంది మహిళలు ప్రయాణించగా.. ఈ నెల 11న అత్యధికంగా 45.94 లక్షల మంది రాకపోకలు సాగించారని పేర్కొన్నారు. ఒక్కరోజులో ఇంతమంది మహిళలు ప్రయాణించడం ఇదే తొలిసారి అని పేర్కొన్నారు. గత ఏడాది రాఖీకి 2.75 కోట్ల ప్రయాణికులను గమ్యస్థానాలకు చేసిందని, ఈ ఏడాది 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించారన్నారు.
గతేడాదితో పోలిస్తే 92.95 లక్షల మంది ఎక్కువగా ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించారని.. ఈ ఏడాది 2.28 కోట్ల కిలోమీటర్లు ఆర్టీసీ బస్సులు తిరిగాయన్నారు. గత ఏడాదితో పోల్చితే 53 లక్షల కిలో మీటర్లను అదనంగా సంస్థ బస్సులను తిపిందని చెప్పుకొచ్చారు. రాఖీ పౌర్ణమికి మహాలక్ష్మి పథకాన్ని మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకుని ఉచితంగా రాకపోకలు సాగించడంపై రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సైతం హర్షం వ్యక్తం చేశారు. అన్నాచెల్లెల్ల బంధం ఎంత గొప్పదో ఈ రాఖీ గణాంకాలు తెలియజేస్తున్నాయన్నారు. సంస్థ సామర్థ్యాన్ని అంతా ఉపయోగించుకుని రాఖీ పండుగకు రికార్డుస్థాయిలో ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరవేసిన ఆర్టీసీ అధికారులు, సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. రాఖీ పండుగను త్యాగం చేసి, భారీ వర్షాల్లోనూ నిబద్దత, అంకితభావం, క్రమశిక్షణతో పనిచేశారంటూ ప్రశంసించారు.
రద్దీలోనూ మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేశారన్నారు. ముందస్తు ప్రణాళికతో పాటు సిబ్బంది నిబద్దతతో పనిచేయడం వల్లే రాఖీ పండుగకు లక్షలాది మంది ప్రయాణికులను క్షేమంగా సిబ్బంది గమ్యస్థానాలకు చేర్చారని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ తెలిపారు. ఈ రాఖీ పండుగ ఆపరేషన్స్ సంస్థలో సరికొత్త రికార్డులను నమోదు చేసిందని, ఈ నెల 11న ఒక్క రోజులో అత్యధికంగా 68.45 లక్షల మంది ప్రయాణించారని చెప్పారు. ప్రజారవాణా వ్యవస్థపై ప్రజల ఆదరాభిమానాలు ఎంతలా ఉన్నాయో చెప్పేందుకు ఈ రికార్డులే నిదర్శనమని చెప్పారు. ఆర్టీసీకి సహకరిస్తూ.. ప్రజా రవాణా వ్యవస్తను ఆదరిస్తోన్న, ప్రోత్సహిస్తోన్న ప్రయాణికులందరికీ సజ్జనార్ కృతజ్ఞతలు తెలిపారు.