హైదరాబాద్, ఏప్రిల్ 4 (నమస్తే తెలంగాణ) : టీజీపీఎస్సీ గ్రూప్-1 పరీక్షలో తమకు అన్యాయం జరిగిందని అశోక్‌నగర్‌లో ఆందోళన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగుల గోడు పట్టించుకోవాలని, వారికి తగు న్యాయం చేయాలని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. హైదరాబాద్ తెలంగాణ భవనలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రూప్-1లో అవకతవకలు జరిగాయని, ఈ పరీక్ష నిర్వహణలో అనేక లోపాలు ఉన్నాయని, వాటిని సరిదిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉన్నదని సూచించారు. 46 పరీక్ష కేంద్రాల్లో కేవలం 2 సెంటర్లలోనే 74 మంది టాపర్లు ఉన్నారని, కొన్ని సెంటర్లలో ఒక్క టాపర్ కూడా ఎందుకు లేరని ప్రశ్నించారు. పక్క పక్క నంబర్లలో 13 మందికి ఒకే రకమైన ఫలితాలు ఎలా వస్తాయి? ఇదెలా సాధ్యమైంది? అని అనుమానాలను వ్యక్తంచేశారు. గ్రూప్-1లో మొత్తం పేపర్లను మళ్లీ రీ వాల్యూయేషన్ చేయాలని, లేదా మళ్లీ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేస్తున్న గ్రూప్-1 అభ్యర్థులకు తగు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.