నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 24 : బీసీలకు రక్షణ చట్టం తేవాలని బీసీ సంఘం జాతీయ నేత ఆర్.కృష్ణయ్య డిమాండ్‌చేశారు. నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర జాతరలో జరిగిన దాడిలో మృతిచెందిన రెండు నెలల పసిబిడ్డ కుటుంబాన్ని మంగళవారం జిల్లా కేంద్రంలోని ధర్నా శిబిరంలో పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కుమ్మెర మల్లన్నస్వామి దర్శనానికి వెళ్లిన దంపతులపై దాడి చేయడం.. శిశువును పొట్టన పెట్టుకోవడం అగ్రకులాల దురహంకారానికి నిదర్శనమని మండిపడ్డారు. సీఎం రేవంత్‌రెడ్డి అండ చూసుకొని అగ్రవర్ణాలవారు బీసీలపై దాడులు చేస్తున్నారని మండిపడ్డారు.
బీజేపీ స్టేట్ చీఫ్ రాంచందర్‌రావు, డీఎస్పీ అధ్యక్షుడు విశారదన్ మహరాజ్ బాధితుల శిబిరాన్ని సందర్శించి పరామర్శించారు. రాష్ట్రంలో పాలనపై సీఎం రేవంత్ పట్టుకోల్పోతున్నారని విమర్శించారు. జిల్లాకు కూతవేటు దూరంలో ఘటన జరిగి వారం రోజులు కావస్తున్నా ప్రభుత్వం, పోలీస్ యంత్రాంగం పట్టించుకోకపోవడం దరదృష్ణకరమని చెప్పారు. నిందితులను వెంటనే అరెస్టు చేసి చట్టపరంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కుమ్మెర ఘటనకు నిరసనగా నాగర్‌కర్నూల్‌లోని అంబేద్కర్ కూడలిలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దహనం చేసేందుకు యత్నించిన సీపీఐ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు.