హైదరాబాద్, జూన్ 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి తన పాలన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవటానికి డిసెంబర్ 9 నుంచి తెలంగాణ తల్లి ఉత్సవాల పేరిట కొత్త డ్రామాలకు తెరలేపారని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ మండిపడ్డారు. 100 రోజుల కాంగ్రెస్ ప్రభుత్వం పాలనలో వైఫల్యం చెందిందని ధ్వజమెత్తారు. ఢిల్లీలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో లక్ష్మణ్ మాట్లాడారు. ఆరు నెలల్లోనే కాంగ్రెస్ పాలనపై ప్రజల్లో అపనమ్మకం ఏర్పడిందని, కాంగ్రెస్ పాలనలో విత్తనాల కోసం రైతులు బారులు తీరారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటి నుంచి తప్పించుకోవడానికి, కాలయాపన చేసేందుకు తెలంగాణ తల్లి పేరిట కొత్త డ్రామాలకు తెరలేపారని మండిపడ్డారు. సోనియాగాంధీ తెలంగాణ దేవతా? బలిదేవతా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పరిస్థితి ఆడలేక మద్దెల ఓడు అన్నట్టుగా ఉన్నదని ఎద్దేవా చేశారు. రాహుల్ నేతృత్వంలో కాంగ్రెస్ వరుసగా 3 సార్లు ఓడిపోయిందని, ఇండియా కూటమి మొత్తం 233 సీట్లు దక్కించుకుంటే, ఒక్క బీజేపీకే 240 సీట్లు వచ్చాయని పేర్కొన్నారు.