ఖైరతాబాద్, జూలై 14: బీసీలకు కావాల్సింది పదవులు కాదని, రాజ్యాధికారమని రాజ్యసభ సభ్యుడు కృష్ణయ్య పేర్కొన్నారు. తెలంగాణ మేధావుల సంఘం ఆధ్వర్యంలో ‘బీసీ సమాజం అభివృద్ధి-తక్షణ కర్తవ్యం’ అనే అంశంపై అఖిల పక్ష రౌండ్ టేబుల్ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ స్వాతం త్య్రం వచ్చిన 76 ఏండ్లలో ఏ ఒక్క రాజకీయ పార్టీ కూడా బీసీలను పట్టించుకోలేదని ఆరోపించారు. ‘ప్రతి గ్రామంలో వంద మంది బీసీలు విద్యావంతులుగా ఉన్నారని, వారికి పదవులు ఇవ్వాల్సి వస్తుందని సీఎం రేవంత్రెడ్డి అంటున్నారని, కానీ తాము రాజ్యాధికారాన్ని కోరుకుంటున్నామని స్పష్టం చేశారు.
ప్రధాని స్థాయిలో బీసీ ఉంటే సరిపోదని, ఆ విధానాలను అవలంబించాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్ర క్యాబినెట్లో ఉన్న 18 మంది మంత్రుల్లో కేవలం ఇద్దరు, 119 మంది ఎమ్మెల్యేల్లో 21 మంది మాత్రమే బీసీలని పేర్కొన్నారు. ఇక్కడే వివక్ష కనిపిస్తున్నదని, ఇక హక్కుల కోసం ఉద్యమించాల్సి ఉందని చెప్పారు. ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ అసమానతలు తొలగించకుండా భారత్ పూర్తిగా ప్రజాస్వామిక దేశం కాదని స్పష్టం చేశారు. మాజీ ఐఏఎస్ చిరంజీవులు, తెలంగాణ మేధావుల సంఘం చైర్మన్ కేశవులు, రాజ్యాధికార సమితి అధ్యక్షుడు సురేశ్, మేధావుల సంఘం కన్వీనర్లు కిరణ్, శ్రీనివాస్ యాదవ్, ప్రొఫెసర్ ప్రభంజన్ యాదవ్, సురేందర్, కార్యదర్శులు ఎం. నర్సయ్య, డీఎల్ఎన్ చారి, రాహుల్ దేవ్, డాక్టర్ ఎస్ ప్రమీల పాల్గొన్నారు.