హైదరాబాద్, ఫిబ్రవరి 14 (నమస్తే తెలంగాణ): కులగణనలో తప్పులను సరిదిద్దాలని రాజ్యసభ సభ్యుడు, బీఆర్ఎస్ నేత వద్దిరాజు రవిచంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42 శాతం కోటా ఇవ్వాల్సిందేనని, లేదంటే బలహీనవర్గాల ఆగ్రహానికి గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. తెలంగాణభవన్‌లో శుక్రవారం బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్‌గౌడ్, బీఆర్ఎస్ నాయకులు రఘురాం, శ్రీనివాస్, వివేక్రాజుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే బీసీల జనాభాను తగ్గించి చూపిందని ఆరోపించారు. జనాభాలో 51 శాతం ఉన్న బీసీలకు కార్పొరేషన్ పోస్టుల భర్తీలో తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పారు.
మంత్రివర్గంలో కేవలం ఇద్దరు బీసీలకు అవకాశం ఇవ్వడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. మంత్రివర్గ విస్తరణలోనైనా ప్రాధాన్యం కల్పించాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ హయాంలోనే బీసీలకు సముచిత ప్రాధాన్యం దక్కిందన్నారు. మార్కెట్ కమిటీల నియామకంలో బీసీలకు ప్రత్యేక కోటా కేటాయించిన ఘనత బీఆర్ఎస్ సర్కారుకే దక్కుతుందని అన్నారు. కేసీఆర్ బీసీబంధును తీసుకొచ్చారని పేర్కొన్నారు. కాంగ్రెస్ సర్కారు ఈ స్కీంను అమలుచేయకుండా అటకెక్కించిందని దుయ్యబట్టారు.
బీసీలకు 42 శాతం కోటా ఇచ్చిన తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహించాలని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు కిషోర్‌గౌడ్ డిమాండ్ చేశారు. ఇందుకోసం అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలన్నారు. ఇంటింటికీ ఎన్యుమరేటర్లను పంపించి కులగణన రీసర్వే చేయాలని కోరారు. ఎంపీడీవో ఆఫీసులకు వెళ్లి వివరాలు ఇవ్వాలని ప్రజలను ఇబ్బందిపెట్టడం సరికాదన్నారు.