హైదరాబాద్, మార్చి21 (నమస్తే తెలంగాణ ) : ప్రభుత్వం ఎంతో ఊరించిన రాజీవ్ యువవికాసం పథకం యువతను ఉసూరుమనిపిస్తున్నది. కొత్తవారికే దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని కల్పించింది. గతంలో దరఖాస్తు చేసుకున్న 7.44 లక్షల మందికి అవకాశం ఇవ్వడంలేదు. నిరుద్యోగ యువత స్వయంఉపాధి కోసం ఆర్థికసాయం చేయాలని సర్కారు ఈ రాజీవ్ యువవికాసం పథకాన్ని తీసుకొచ్చింది. దీని ద్వారా రూ.6 వేల కోట్లను సబ్సిడీ రుణాలుగా ఇస్తామని ప్రకటించింది. ప్రస్తుత బడ్జెట్లో ఎస్సీ కార్పొరేషన్ కింద రూ.2,000 కోట్లు, ఎస్టీ కార్పొరేషన్ కింద రూ.1,360 కోట్లు, బీసీ కార్పొరేషన్ కింద రూ. 1,800 కోట్లు, మైనార్టీ కార్పొరేషన్ కింద రూ.840 కోట్లను మొత్తంగా రూ.6,0 00 కోట్లను పొందుపరిచింది. ఇప్పటికే దరఖాస్తుల స్వీకరణను ప్రారంభించింది. ఏప్రిల్ 4 వరకు తుది గడువును విధించింది. జూన్ 2లోగా లబ్ధిదారులను ఎంపిక చేసి ఆర్థికసాయాన్ని అందిస్తామని వెల్లడించింది.
బీసీబంధు, మైనార్టీబంధు కోసం గత ప్ర భుత్వ హయాంలో దరఖాస్తు చేసుకున్న 7,44,862 మందికి ప్రస్తుత రాజీవ్ యువవికాసం పథకంలో అవకాశం దక్కడం లేదు. బీసీ కులవృత్తిదారులకు బ్యాంకు లింకేజీ లేకుండా నేరుగా రూ.లక్ష వరకు ఆర్థికసాయాన్ని అందించేందుకు గత బీఆర్ఎస్ సర్కా రు బీసీబంధు పథకాన్ని ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా 5,28,862 దరఖాస్తులు రాగా, 4.13 లక్షల మందిని రూ.1 లక్ష ఆర్థిక సాయానికి అర్హులుగా అప్పటి ప్రభుత్వం గుర్తించింది. అసెంబ్లీ ఎన్నికల వరకు 40 వేల మంది వృత్తిదారులకు ఆర్థికసాయాన్ని అందించింది. మిగతా 3.73 లక్షల మందికి సైతం ప్రతినెలా 15న అందించాలని ప్రణాళిక రూ పొందించింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి న అనంతరం ఆ పథకాన్ని అటకెక్కించింది. ఆ దరఖాస్తులన్నింటినీ పక్కనబెట్టింది. మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఎకనామిక్ సపోర్ట్ పథకం కింద అర్హులైన మైనార్టీలకు రూ.లక్ష ఆర్థికసాయం అందించాలని గత బీఆర్ఎస్ సర్కార్ నిర్ణయించింది. ఆ పథకానికి 2.16 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. తొలివిడతలో 11 వేల మందికిపైగా లబ్ధిదారులను ఎంపిక చేసింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో తొలివిడతలో 4,500 మందికి, మిగతా జిల్లా ల్లో 6,500 మందికి చెక్కులను మంజూరు చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రెండు పథకాలను ప్రస్తుతం నిలిపేసింది. రాజీవ్ యువవికాసం పథకంలో మళ్లీ దరఖాస్తు చేసుకునే అవకాశాన్ని లేకుండా చేసింది. మిగిలిన 5.28లక్షల మంది బీసీ, 2.16 లక్షల మంది మైనార్టీలకు అన్యాయం జరుగుతుంది.
ప్రభుత్వం ఆన్లైన్లో ఓబీఎంఎంఎస్ (ఆన్లైన్ బెన్ఫిషరీ మేనేజ్మెంట్ అండ్ మానిటరింగ్ సిస్టమ్) సైట్ ద్వారా దరఖాస్తులను స్వీకరిస్తున్నది. అందులో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారి దరఖాస్తులు ఎంటర్ కావడం లేదు. పేరు నమోదు చేసి, ఆధార్ నంబర్‌ను ఎంట్రీ చేయగానే, ఆటోమెటిక్‌గా రేషన్‌కార్డు నంబర్ కూడా ప్రత్యక్షం అవుతున్నది. ఆయా నంబర్లు ఇప్పటికే రిజిస్టర్డ్ అయ్యి ఉన్నాయని పేర్కొంటూ ఆ సైట్ క్లోజ్ అవుతున్నది. దీంతో ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న వారికి అవకాశం లేకుండా పోయింది.
రాజీవ్ యువవికాసం పథకం కింద గతం లో రుణాల కోసం చేసుకున్న దరఖాస్తులను సైతం పరిగణనలోకి తీసుకుంటారా? లేదా? అనే అంశంపై సర్కారు ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. గతంలో బ్యాంకు లింకేజీ లేకుండా 100 శాతం సబ్సిడీతో బీసీ, మైనార్టీ బంధు కింద రూ.లక్ష వరకు ఆర్థికసాయం అందించారు. ప్రస్తుతం కాంగ్రెస్ సర్కారు 60 శాతం, 70 శాతం సబ్సిడీపై 2 లక్షల నుంచి రూ.4 లక్షల వరకు రుణాలను అందిస్తున్నది. రుణం మొత్తాన్ని పెంచింది. కొత్తవారికే అవకాశం ఇవ్వడంపై నిరుద్యోగులు మండిపడుతున్నారు.
ప్రభుత్వం ట్రైకార్ రుణ బకాయిలను తక్షణమే చెల్లించాలనే డిమాండ్‌తో ఏప్రిల్ 7న చలో సంక్షేమ భవన్ కార్యక్రమానికి గిరిజన సంఘాల జేఏసీ పిలుపునిచ్చింది. హిమాయత్‌నగర్‌లో తెలంగాణ గిరిజన సమాఖ్య, తెలంగాణ గిరిజన సంఘం నేతలు శుక్రవారం నిర్వహించిన రౌండ్‌టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. వివి ధ గిరిజన సంఘాల నేతలు ప్రభుత్వం రాజీవ్ యువవికాసం పేరుతో నూతన పథకాన్ని హడావుడిగా ప్రారంభించడంపై అనుమానాలు వ్యక్తంచేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ట్రైకార్ సంస్థ ద్వారా 2019-2021 మధ్య గిరిజన యువత నుంచి దరఖాస్తులను స్వీకరించిందని, అందులో 30 వేల మందికి రుణాలు మంజూరు చేసిందని తెలిపారు. లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయడానికి రూ.219 కోట్ల విలువైన చెకులను సిద్ధం చేసి క్లియరెన్స్ కోసం ఆర్థికశాఖకు పంపిందని వివరించారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు రుణాలను రద్దు చేయాలనే కుట్ర చేస్తున్నదని గిరిజన సంఘాలు నేతలు ఆరోపించారు. పాత బకాయిలు చెల్లించకుండా రాజీవ్ యువవికాసం పథకాన్ని ప్రవేశపెట్టడంపై ఆందోళన కలుగుతున్నదని తెలిపారు. యువవికాసం పథకంలో మళ్లీ దరఖాస్తులు చేసుకుంటే తిరస్కరణకు గురవుతున్నాయని వాపోయారు. ఏప్రిల్ 5లోగా ట్రైకార్ రుణ బకాయిలను విడుదల చేయాలని, లేదంటే 7న సంక్షేమభవన్‌ను ముట్టడిస్తామని హెచ్చరించారు. సమావేశంలో గిరిజన నాయకులు శ్రీరామ్‌నాయక్, రాంనాయక్, రాంబాల్‌నాయక్, రవీందర్‌నాయక్ పాల్గొన్నారు.