హైదరాబాద్, మార్చి 3 (నమస్తే తెలంగాణ): సీఎం కేసీఆర్, రాష్ట్ర ప్రభుత్వ జలసంకల్పం ఎంతో గొప్పదని, అందువల్లే మహాద్భుత కాళేశ్వరం ప్రాజెక్టు అత్యంత స్వల్పకాలంలో సాకారమైందని రాజస్థాన్ ఇంజినీర్ల బృందం ప్రశంసలు కురిపించింది. సాగునీటిపారుదల రంగంలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి సంభ్రమాశ్చర్యాలను వ్యక్తం చేశారు. నేషనల్ హైడ్రాలజీ ప్రాజెక్టులో భాగంగా టెక్నికల్ అంశాల అధ్యయనానికి రాజస్థాన్ జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ మీనా నేతృత్వంలో 14 మంది ఇంజినీర్ల బృందం కాళేశ్వరం ప్రాజెక్టును అధ్యయనం చేస్తున్నది. తొలిరోజున లక్ష్మీబరాజ్, పార్వతీ పంప్‌హౌస్, గాయత్రీ పంప్‌హౌస్‌ను పరిశీలించిన ఇంజినీర్ల బృందం శుక్రవారం రంగనాయకసాగర్, మల్లన్నసాగర్ రిజర్వాయర్లతోపాటు, గెస్ట్‌హౌస్‌లు, పంప్‌హౌస్‌లను పరిశీలించింది. ఇంజినీర్ల బృందానికి పంప్‌హౌస్‌లు, జలాశయాల ప్రత్యేకతలను గజ్వేల్ ఈఎన్సీ హరిరాం క్షుణ్ణంగా వివరించారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఇప్పటివరకు సాధించిన ఫలితాలపై పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. అక్కడి నుంచి ముత్రాజ్పల్లి నిర్వాసిత కాలనీని సందర్శించారు. నిర్వాసితులకు తెలంగాణ సర్కారు నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేశారు.
పట్టుదల ఉంటే తప్ప సాధ్యం కాదు
కాళేశ్వరం ప్రాజెక్టును మూడేండ్లలోనే నిర్మించడం మహాద్భుతమని రాజస్థాన్ జలవనరులశాఖ చీఫ్ ఇంజినీర్ డాక్టర్ మీనా కొనియాడారు. పట్టుదల ఉంటే తప్ప కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం సాధ్యం కాదని ప్రశంసించారు. రాష్ట్రంలో నిర్మించిన రిజర్వాయర్లు, ప్రాజెక్టుల వల్ల సాధించిన ప్రగతి కండ్లకు కనబడుతున్నదని హర్షం వ్యక్తం చేశారు. భూనిర్వాసితులకు డబుల్ బెడ్రూం ఇండ్లను నిర్మించి ఇవ్వడం గొప్పవిషయమని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం నీటి పారుదల విధానంలో దేశానికి మోడల్‌గా నిలుస్తున్నదని, సీఎం కేసీఆర్ చాలా గొప్పగా పనిచేశారని ప్రశంసలు కురిపించారు. ప్రాజెక్టును సందర్శించిన ఇంజినీర్ల బృందంలో ఎస్ఈలు సంతోష్‌గుప్తా, రాధామోహన్శర్మ, ధీరజ్చావా తదితరులు ఉన్నారు.