ఖలీల్వాడి, జూన్ 24: కాంగ్రెస్ పార్టీ యాదవ కులస్థులను అణచి వేస్తున్నదని యాదవ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రాజారాం యాదవ్ విమర్శించారు. ప్రభుత్వ తీరుకు నిరసనగా ఈ నెల 30న హైదరాబాద్లోని ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు. ఈ మేరకు మంగళవారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మహాధర్నా పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం రేవంత్రెడ్డి యాదవులు, మున్నూరుకాపులు, ఇతర కులాలను అణచివేస్తున్నట్టు మండిపడ్డారు.
అత్యధిక జనాభా ఉన్న యాదవులను రేవంత్రెడ్డి కించపరుస్తూ మంత్రివర్గంలో స్థానం కల్పించకపోవటం, కనీసం ఎమ్మెల్సీ, నామినేటెడ్ పోస్టుల్లోనూ అవకాశం కల్పించకపోవడం దారుణమని అన్నారు. బీసీలకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆపేది లేదని హెచ్చరించారు. యాదవులను అవమానపరుస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి సరైన బుద్ధిచెప్పాలని రాజారాం యాదవ్ పిలుపునిచ్చారు. ఈ నెల 30న నిర్వహించనున్న మహాధర్నాను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.