హైదరాబాద్, అక్టోబర్ 13 (నమస్తే తెలంగాణ): భక్తుల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని వారికి ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా వేములవాడ రాజన్న దర్శనం కల్పించేలా ఏర్పాట్లు చేసినట్లు దేవాదాయ శాఖ అధికారులు తెలిపారు. ఇందుకు సంబంధించి ఆలయం బయట ప్రత్యేకంగా ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. వేములవాడలో రాజరాజేశ్వరస్వామి ఆలయ అభివృద్ధి పనులను చేపడుతున్న విషయం తెలిసిందే. దీంతో భక్తులకు భీమేశ్వరాలయంలో దర్శన ఏర్పాట్లు చేశారు. అయితే త్వరలో సమక్క సారలమ్మ జాతర జరుగనున్న నేపథ్యంలో అక్కడికి వెళ్లే భక్తులు ముందుగా వేములవాడ రాజరాజేశ్వరస్వామి దర్శనం చేసుకుంటారు. అందుకే భక్తుల కోసం ఎల్ఈడీ స్క్రీన్ల ద్వారా మూల విరాట్ దర్శనం కల్పించనున్నారు.