సంస్థాన్ నారాయణపురం, జనవరి 23: మధ్యాహ్నం ఒంటి గంట తరువాతే వైన్స్ షాపులు తెరువాలని, సిట్టింగ్ సాయంత్రం ఆరు గంటల తరువాత మొదలు పెట్టాలని మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి జారీ చేసిన ఆదేశాలను ఎక్సైజ్‌శాఖ అధికారులు, వైన్స్‌షాప్ నిర్వాహకులు తిప్పికొట్టారు. ఎమ్మెల్యే ఆదేశాలను పాటిస్తే తీవ్రంగా నష్టపోతామని భావించిన మద్యంషాపు యజమానులు మండలంలోని సంస్థాన్ నారాయణపురం, సర్వేల్ గ్రామాల్లో ఉన్న మూడు వైన్స్ షాపులు, సిట్టింగ్ రూంలను ఉదయం 10 గంటలకే తెరిచారు. ఎమ్మెల్యే రూల్స్ పాటించకుండా వైన్స్ షాపులను ఎలా తీస్తారని నిర్వాహకులను హెచ్చరిస్తూ రాజగోపాల్‌రెడ్డి అనుచరులు మూడు వైన్ షాపులను గురువారం బంద్ చేయించారు. దీంతో వైన్స్‌షాప్ నిర్వాహకులు ఎక్సైజ్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఎక్సైజ్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు జోక్యం చేసుకొని శుక్రవారం ఉదయం 10 గంటలకు వైన్స్ షాపులు, సిట్టింగ్ రూములను తెరిపించారు.
ఎక్సైజ్ , ఎన్ఫోర్స్మెంట్ అధికారుల పహారాలో మద్యం అమ్మకాలు చేపట్టారు. అక్కడికి చేరుకున్న ఎమ్మెల్యే అనుచరులు .. మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే రూల్స్ పాటించాలని, లేనిపక్షంలో షాప్‌లు నడిపించవద్దని ఎక్సైజ్ అధికారులు, వైన్స్ షాప్ నిర్వాహకులతో వాగ్వాదానికి దిగారు. రాష్ట్రం మొత్తం ఒకటే మద్యం పాలసీ అమల్లో ఉంటుందని ఎక్సైజ్ అధికారులు ఎమ్మెల్యే అనుచరులకు సూచించారు. బలవంతంగా మద్యం షాపులు బంద్ చేస్తేకఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రూ.లక్షల పెట్టుబడి పెట్టి ఎమ్మెల్యే, ఎక్సైజ్ శాఖ అధికారుల తీరుతో తీవ్రంగా నష్టపోతున్నామని వైన్స్ నిర్వాహకులు వాపోతున్నారు. రాష్ట్రంలో ఎక్కడాలేని మద్యం పాలసీ మునుగోడులో ఎందుకు పెడుతున్నారని మందుబాబులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.