Heavy Rains | హైదరాబాద్, జూలై 29 (నమస్తే తెలంగాణ): ఎడతెరిపి లేని వర్షాలు సరికొత్త రికార్డులు సృష్టించాయి. తెలంగాణ చరిత్రలో ఇవే అత్యధిక వర్షాలు. బుధవారం నుంచి గురువారం వరకు ములుగు జిల్లా లక్ష్మీదేవిపేటలో 64.98 సెం.మీ. వర్షం కురిసింది. ఇది ఆల్టైమ్ రికార్డు. అదే స మయంలో రాష్ట్రవ్యాప్తంగా సగటున 97.7 మి. మీ. వర్షపాతం నమోదైంది. ఇది కూడా రికార్డే. ఎన్నడూ ఇంత వర్షపాతం నమోదుకాలేదు.
01
హైదరాబాద్ చరిత్రలో ఒకరోజులో అత్యధిక వర్షపాతం 1908 సెప్టెంబర్ 28న నమోదైంది. ఆ రోజు నగరంలో ఏకంగా 29.1 సెం.మీ. వర్షం పడింది. కాగా, ఈ నెల 19 నుంచి 28 వరకు అంతకు ముందు వారంతో పోలిస్తే హైదరాబాద్లో 299% అధిక వర్షపాతం నమోదైంది. 24 గంటల వ్యవధిలో రాష్ట్రవ్యాప్తంగా 35 ప్రాంతాల్లో 20సెం.మీ. కు పైగా, 200 ప్రాంతాల్లో 10 సెం.మీ.కుపైగా నమోదైంది. రాష్ట్రంలో సాధారణంగా 10 రోజుల్లో 91 మి.మీ. కురవాల్సి ఉండగా, 362.1 మి.మీ. నమోదైంది. ఈ సీజన్లో 28వ తేదీ నాటికి వర్షపాతం 327.3 మి.మీ. పడాల్సి ఉండగా, 541.2 మి.మీ.తో 65% అధికంగా నమోదైంది. ఈ నెల 17వ తేదీ వరకు 54% లోటుగా ఉన్న వర్షపాతం 28వ తేదీ నాటికి 65% మిగులు కావడం గమనార్హం. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని, దాంతో ఈ ఏడా ది గరిష్ఠ వర్షపాతం నమోదయ్యే అవకాశమున్నదని వాతావరణ శాఖ తెలిపింది.