హైదరాబాద్, జూలై 12 (నమస్తే తెలంగాణ): అల్పపీడన ద్రోణి ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. శుక్రవారం రాత్రి నుంచి ఆదివారం వరకు పలు జిల్లాల్లో భారీ వర్షాలకు అవకాశం ఉందని పేర్కొంది. శుక్రవారం ఖమ్మం జిల్లా వైరాలో అత్యధికంగా 5.04 సెం.మీ వర్షపాతం నమోదైంది. నైరుతి రుతుపవనాలు చురుగ్గా మారడంతో రానున్న రెండు వారాలు రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
మహదేవపూర్/కన్నాయిగూడెం, జూలై 12 : మేడిగడ్డ (లక్ష్మీ) బరాజ్‌కు శుక్రవారం ఇన్‌ఫ్లో 43,500 క్యూసెకుల రాగా, ఎనిమిది బ్లాక్‌లలోని 85 గేట్లు ఎత్తి అంతే మొత్తం దిగువకు విడుదల చేస్తున్నారు. ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం తుపాకులగూడెం సమ్మక్క బరాజ్ వద్ద గోదావరి నీటిమట్టం తగ్గుతున్నది. శుక్రవారం ఎగువ నుంచి 64,350 క్యూసెక్కుల వరద వచ్చినట్టు అధికారులు తెలిపారు.