హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): రాష్ట్రవ్యాప్తంగా ఈ వానకాలంలో ఇప్పటివరకు సగటున 29 రోజులే వర్షాలు కురిసినట్టు హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. అత్యధికంగా కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లాలో 33 రోజులు, అత్యల్పంగా హైదరాబాద్, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట, జనగామ జిల్లాల్లో 14 నుంచి 18 రోజు లే వర్షం కురిసిందని తెలిపింది. సగటు వర్షపాతం 324.4 మి.మీ కాగా.. ఆదివారం వర కు 324.8 మి.మీ నమోదైంది. పలు జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదుకాగా, కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే అధిక వర్షపాతం నమోదైంది. మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూ ల్, నారాయణపేట, రంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల్లో అధిక వర్షపాతం నమోదైందని తెలిపింది. జనగామ, జగిత్యాల, పెద్దపల్లి, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైందని వెల్లడించింది. మరో రెండు రోజులపాటు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి, మోస్తరు వర్షం కురుస్తుందని పేర్కొంది.
కృష్ణాలో స్థిరంగా ఇన్‌ఫ్లో
రాష్ట్రంలో జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు స్థిరంగా వరద కొనసాగుతున్నది. తెలంగాణ, మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో ప్రధాన గోదావరిలో ఎస్సారెస్పీకి, ఎల్లంపల్లికి కూడా స్వల్ప వరద ప్రవాహం ప్రారంభమైంది. ప్రాణహితలో వరద పెరుగుతున్నది. మేడిగడ్డ లక్ష్మీబరాజ్ వద్ద శనివారం 3.48లక్షల క్యూసెక్కుల వరద కొనసాగగా, ఆదివారం సాయంత్రానికి 4.40 లక్షల క్యూసెక్కులకు చేరుకున్నది.