Telangana | హైదరాబాద్, మార్చి 16 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ వ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. మార్చి నెలలోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలతో జనం బెంబేలెత్తుతున్నారు. 23 జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 41 డిగ్రీలకు పైగా నమోదయ్యాయి. సాధారణం కంటే 3.3 డిగ్రీలు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ముఖ్యంగా ఉత్తరతెలంగాణ జిల్లాల్లో ఎండల ప్రభావం ఎకువగా ఉందని పేర్కొన్నారు.
ఆసిఫాబాద్లో 42.4, ఆదిలాబాద్, మంచిర్యాల, సిరిసిల్లలో 41.5, గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోద య్యాయి. 39 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రత నమోదవుతున్న జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్, 38 నుంచి 39.6 డిగ్రీలు నమోదైన జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. మరోవైపు రానున్న పది రోజుల్లో తెలంగాణలో భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఏర్పడనున్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. మార్చి 19 వరకు వేడిగాలుల బాధలు కొనసాగుతాయని, 20 నుంచి 24 వరకు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. అకాలవర్షాలను దృష్టిలో పెట్టుకుని రైతులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.