హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఐదురోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉపరితల ఆవర్తనం కోస్తా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతంపై సముద్రమట్టానికి సగటున 5.8 కి.మీ ఎత్తులో విస్తరించి ఉన్నట్టు తెలిపింది. కోస్తాను ఆనుకుని పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో సముద్రమట్టానికి సగటున 3.1 కి.మీ ఎత్తులో ఉపరితల ఆవర్తనం బుధవారం విస్తరించి ఉన్నదని, దీని ప్రభావం తో రాబోయే ఐదు రోజులు ఏపీ, తెలంగాణలో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతోపాటు, ఉరుములు, మెరుపులతో తేలికపాటి నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉందని అంచనా వేసింది. ఆదివారం వరకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. ములుగులో అత్యధికంగా అంటే 96.3 మి.మీ వర్షపాతం నమోదైంది. హైదరాబాద్‌లో అత్యల్పంగా షేక్‌పేటలో 3.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ తెలిపింది.