Weather Update | హైదరాబాద్, మే 16 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో వాతావరణం ఒకసారిగా చల్లబడింది. వాతావరణ శాఖ సూచించినట్టుగానే.. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తున్నాయి. మధ్యాహ్నం రెండింటి వరకు ఎండ రాగా.. ఒకసారిగా వాతావరణం మారిపోయింది. క్యుములోనింబస్ మేఘాలు కమ్ముకుని..ఆకాశానికి చిల్లుపడిం దా అన్నట్టుగా భారీ వర్షం కురిసింది. రాష్ట్రం లో రాగల ఐదు రోజులు ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజులు పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలను వాతావరణ శాఖ జారీ చేసింది.
బుధవారం తూర్పు విదర్భ పరిసర ప్రాంతాలలో కొనసాగిన ఆవర్తనం గురువారం మధ్యప్రదేశ్ నైరుతి ప్రాం తాలలో సగటు సముద్ర మట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉన్నట్టు పేరొన్నది. ఆవర్తనం ప్రభావంతోనే రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నట్టు వెల్లడించింది. ఉష్ణోగ్రతల విషయానికొస్తే.. ముందున్నంత ఎండ లు ఉండకపోవచ్చని, గరిష్ఠంగా 43డిగ్రీలు నమోదయ్యే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించింది.