Monsoon | హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): కేరళను మే 30న తాకిన నైరుతి రుతుపవనాలు ఆదివారం కర్ణాటక మీదుగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాల్లోకి విస్తరించాయి. ఈ నెల 6 తర్వాత రుతుపవనాలు తెలంగాణను తాకే అవకాశం ఉంది. ఆదివారం హైదరాబాద్‌తో పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షం కురిసింది. సికింద్రాబాద్‌లో ఒక్కసారిగా వాతావరణం చల్లబడింది. రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గంలో ఓ మోస్తరు వర్షం కురిసింది.
కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి మండలం మొఖాసిగూడలో ఈదురుగాలులకు ఇండ్ల పైకప్పులు ఎగిరిపోయాయి. ప్రభుత్వ దవాఖాన వద్ద భారీ వృక్షం విరిగిపడింది.జగిత్యాల జిల్లా కోరుట్లలో పిడుగుపాటుకు చెట్లు నేలకూలాయి. రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబగద్వాల జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ నెల 4 వరకు ఆయా జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది.
తెలంగాణలో 3 రోజులు వర్షాలు ..
రాష్ట్రంలో రాగల మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, సంగారెడ్డి, మహబూబ్ నాగర్‌కర్నూల్, జోగులాంబ గద్వాల జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.
కూలిన స్తంభాలు.. ఎగిరిపడిన రేకులు
యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం వీరవెల్లిలో రేగు మల్లేశానికి చెందిన రూ.60వేల విలువైన పశువుల కొట్టం రేకులు కొట్టుకుపోయాయి. బీఎన్ తిమ్మాపురానికి చెందిన అంగడి సుధాకర్ ఫొటో స్టూడియోపై రేకులు ఎగిరిపడ్డాయి. రూ.3 లక్షల విలువైన కంప్యూటర్లు, ప్రింటర్, ఫర్నిచర్ ధ్వంసమయ్యాయి. బాచుప్పలలో జినుకుల శ్రీశైలానికి చెందిన 5 వేల కోళ్ల ఫాం నేలమట్టమైంది. ఉమ్మడి మెదక్ జిల్లా మద్దూరు మండలం వల్లంపట్లలో పిడుగు పాటుతో పాడిగేదె మృతిచెందింది.
ఆసిఫాబాద్‌లో గుండి పెద్దవాగులోని తాత్కాలిక వంతెన కొట్టుకుపోయింది. బెల్గాంలో లోనారే హనుమంతుకు చెందిన 10 మేకలు పిడుగుపడి మృతి చెందాయి. జన్నారం మండలం కలమడుగులో సిటనోజు రాజన్న, శ్యామల ఇంటి పైకప్పు రేకులు లేచిపోయాయి. కిష్టంపేటలో కొనుగోలు కేంద్రాల్లోని ధాన్యం తడిసిపోయింది.
వేమనపల్లి మండలం జిల్లెడలో దాసరి పోచయ్యకు చెందిన గేదె పిడుగు పడి మృతిచెందింది. నీల్వాయిలో కొనుగోలు కేంద్రంలో 30 మంది రైతుల ధాన్యం తడిసిపోయింది. కన్నెపల్లి మండలం మొక్కపల్లిలో పిడుగు పడడంతో గాదర్ల మహేశ్, పెద్దల రాజయ్య, బైరి గట్టన్న, పోసు, గట్టయ్యకు చెందిన ఒక్కో మేక, గాదర్ల కొమురయ్యకు చెందిన మూడు మేకలు మృతిచెందాయి.