హైదరాబాద్: మరో 3 గంటల్లో ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే (Rain Update) అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, కుమ్రం భీమ్ ఆసిఫాబాద్, కామారెడ్డి, కరీంనగర్, జగిత్యాల, పెద్దపల్లి, మంచిర్యాల, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో వర్షం కురుస్తుందని వెల్లడించింది. గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది.
అదేవిధంగా మధ్యాహ్నం పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. హైదరాబాద్, మేడ్చల్-మల్కాజిగిరి, రంగారెడ్డి, సంగారెడ్డి, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, జనగామ, జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వర్షం పడుతుందని తెలిపింది. ఉరుములు, మెరుపులతోపాటు గంటకు 40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.