పెనుబల్లి (కల్లూరు)/జూలూరుపాడు/ దుమ్ముగూడెం/పెద్దపల్లి/ సారంగాపూర్, అక్టోబర్ 21 : పండిన పంట చేతికొచ్చిందనుకునేలోపే కురిసిన వర్షం కళ్లముందే ఆ పంటను నేలపాలు చేసింది. దీంతో అన్నదాతలు ఆవేదనకు గురవుతున్నారు. ఖమ్మం జిల్లా కల్లూరు మండలంలోని చంద్రుపట్ల, ఎర్రబోయినపల్లి, కొత్తలింగాల, కిష్టయ్యబంజర, గోపారం, కప్పలబంధం తదితర గ్రామాల్లో కోతకొచ్చిన పంట గాలి దుమారంతో కూడిన భారీ వర్షానికి నేలకొరిగింది. భద్రాద్రి జిల్లా జూలూరుపాడు మండలంలో వర్షానికి పత్తి, మిర్చి పంటలు దెబ్బతిన్నాయి. దుమ్ముగూడెం మండలంలోనూ వందల ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. పెనుబల్లి మండలం కొత్తకారాయిగూడెం, కోండ్రుపాడు, అడవిమల్లెల, కుప్పెనకుంట్ల గ్రామాల్లో కురిసిన వర్షానికి వరి పంట నేలవాలింది. జగిత్యాల జిల్లా బీర్పూర్ మండలంలోని పలు గ్రామాల్లో ఈదురుగాలులతో వర్షం పడడంతో కోతకచ్చిన వరిపంటలు నేలకొరిగాయి. తాళ్లధర్మారం గ్రామంలో సుమారు వంద ఎకరాల్లో పంటలు నేలవాలాయి. దీంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి ప్రభుత్వం నుం చి నష్టపరిహారం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.