హైదరాబాద్, జూలై 2 (నమస్తే తెలంగాణ): ‘దేశం ఈ దుస్థితిలో ఉండటానికి కాంగ్రెస్, బీజేపీ చేసిన పాపాలే కారణం.. ఫ్రంట్లు, టెంట్లు దేశాన్ని బాగు చేయలేవని చరిత్రలో నిరూపితమైంది.. అందుకే దేశం ముందు ప్రత్యామ్నాయ ఫ్రంట్ కాదు.. ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచాలన్నదే నా సంకల్పం.. ఎన్నికల్లో పార్టీలు గెలవడం కాదు.. ప్రజలు గెలవాలి.. అందు కోసమే బీఆర్ఎస్ పుట్టింది’.. సీఎం కేసీఆర్ తరచూ చెప్పే మాటలు ఇవి. ఇతర పార్టీలతో కలిసి కూటమి కట్టడం తమ లక్ష్యం కాదని మొదటి రోజు నుంచి చెప్తున్నారు. ప్రతిపక్ష పార్టీలు, నేతలు జరిపే సమావేశాలకు దూరంగా ఉంటున్నారు. కానీ, రాహుల్‌గాంధీ ఈ వాస్తవాన్ని వక్రీకరించారు. ప్రతిపక్ష నేతల సమావేశానికి సీఎం కేసీఆర్ వస్తే కాంగ్రెస్ హాజరు కాదని కరాఖండిగా చెప్పామంటూ గప్పాలు కొట్టుకున్నారు. కేసీఆర్ జాతీయ పార్టీని స్థాపించాలనుకున్న సమయంలోనే ప్రస్తుతం ప్రతిపక్ష కూటమి అని చెప్పుకుంటున్న దాదాపు అన్ని పార్టీల నేతలను స్వయంగా వారి రాష్ర్టాలకు వెళ్లి కలిశారు. జాతీయ పార్టీ పెట్టడం వెనుక ఉద్దేశాన్ని వివరించారు. దేశం ప్రస్తుతం ఎదుర్కొంటున్న దుస్థితిని చెప్పి, తాను ఏ రకమైన ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచబోతున్నారో తెలియజేశారు. దేశంలో గుణాత్మక మార్పు కోసం తాను చేపట్టే ఉద్యమాన్ని, కార్యాచరణను వివరించారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం ఎలాంటి కూటమి ఏర్పాటు చేయనని, ఏ ఫ్రంట్‌లోనూ కలువబోనని, ప్రజల కోసమే పని చేస్తానని స్పష్టం చేశారు. దానికి కట్టుబడే సొంతంగా పార్టీని విస్తరిస్తున్నారు. దేశ రాజధాని ఢిల్లీలో పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఏపీ, మహారాష్ట్రల్లోనూ కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఇతర రాష్ర్టాల్లోనూ బీఆర్ఎస్ శరవేగంగా ఎదుగుతున్నది. ఈ వాస్తవాన్ని రాహుల్ మరిచిపోయి, ప్రతిపక్ష నేతలను తానే బీఆర్ఎస్కు దూరం చేసినట్టు చెప్పుకోవడం సిగ్గుచేటని తెలంగాణవాదులు మండిపడుతున్నారు.
భుజాలనెక్కడం కాంగ్రెస్‌కు అలవాటే..
వాస్తవానికి రాజీవ్‌గాంధీ హయాం తర్వాత కాంగ్రెస్‌కు సొంతంగా అధికారం ఏర్పాటు చేసే స్థాయి పోయింది. దశాబ్దాలుగా ఆ పార్టీ దేశవ్యాప్తంగా పలుచనవుతూ.. చివరికి ఒక పెద్ద రాజకీయ పార్టీగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రాంతీయ పార్టీలకంటే 50-100 సీట్లు ఎక్కువ తెచ్చుకోవడం, అధికారం కోసం కూటమి కట్టి, ప్రాంతీయ పార్టీల భుజాలపై ఎక్కి అధికారాన్ని అందుకోవడం కాంగ్రెస్‌కు పరిపాటిగా మారింది. సంకీర్ణ ప్రభుత్వాలను ఏర్పాటు చేసి, ఒక్క గట్టి నిర్ణయాన్ని తీసుకోలేని చేతగాని తనాన్ని నిరూపించుకోవడం, రూ.వేల కోట్ల కుంభకోణాలు చేయడం కాంగ్రెస్‌కే చెల్లింది. అందుకే ప్రజల్లో మరింత చులకనైంది. లోక్‌సభలో కనీసం ప్రతిపక్ష హోదా పొందలేని దుస్థితికి కాంగ్రెస్ దిగజారిన విషయాన్ని రాహుల్ మరిచిపోయినట్టున్నారు. దేశంలో కాంగ్రెస్ లేకపోతే బీజేపీదే అధికారం అనే సంస్కృతికి చరమగీతం పాడాలని సీఎం కేసీఆర్ నిర్ణయించుకున్నారు. ‘బీజేపీని గద్దె దించడంతోపాటు కాంగ్రెస్‌ను అధికారంలోకి రానిచ్చే సమస్యే లేదు’.. అని శపథం చేశారు. అందుకే బీఆర్ఎస్ను ఏర్పాటు చేసి సొంతంగా ప్రయాణం ప్రారంభించారు. క్రమంగా దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నారు. రాహుల్ ఈ వాస్తవాలన్నింటినీ దాచిపెట్టి, తానేదో చేసినట్టు చెప్పుకోడంపై విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.