హైదరాబాద్, జూన్ 15 (నమస్తే తెలంగాణ): మీనాక్షి రాజకీయ బలిహరణకు ప్రాయశ్చిత్తం జరుగాల్సిందేనని కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ పట్టుబడుతున్నారా? ఎక్కడైతే కోవర్టు రాజకీయాలకు బలైందో అక్కడి నుంచే ఆమెను రాజ్యసభకు పంపాల్సిందేనని అల్టిమేటం జారీచేశారా? వెళ్లు..వెళ్లి ఎవరితో రాజీనామా చేయిస్తావో చేయించు అని వార్నింగ్ ఇచ్చారా? ఇందుకోసం బీసీ బిడ్డను బలిపీఠం ఎక్కించేందుకు స్కెచ్ వేశారా? మీనాక్షీ నటరాజన్ సీటుకు ఎసరు పెట్టిన వాళ్లు ఇప్పుడు అనిల్ యాదవ్ సీటు కిందికి నీళ్లు తెస్తున్నారా? అంటే గత కొన్ని రోజులుగా ఢిల్లీ, హైదరాబాద్‌లో జరుగుతున్న పరిణామాలు ‘అవును’ అనే సమాధానం ఇస్తున్నాయి. ఈ క్రమంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యుల్లో ముగ్గురు అగ్రకుల ఎంపీలను కాపాడుతూ.. యువకుడు, బీసీ నాయకుడైన అనిల్ యాదవ్‌ను రాజకీయ బలిపశువును చేసేందుకు సిద్ధమవుతున్నట్టు విశ్వసనీయ సమాచారం.
మధ్యప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికల బరిలో నిలిచిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు, పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షీ నటరాజన్ నామినేషన్ తిరసరణకు గురికావడం, ఆపై సుప్రీంకోర్టులోనూ ఆమెకు ఊరట లభించకపోవడం రాజకీయ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని అంతర్గత విభేదాలు, కోవర్టు రాజకీయాలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమయ్యాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రం నుంచే ఆమె కోర్టు కేసుకు సంబంధించిన వివరాలు లీకు కావటం, పోటీకి ఆమె అనర్హురాలని ప్రకటించే వరకు కేసుకు సంబంధించిన ఆలోచనల నుంచి ఆమె దృష్టి మరల్చటం తదితర విషయాల మీద రాజకీయ విశ్లేషకులు ఎవరికి తోచినట్టు వారు వ్యాఖ్యానిస్తున్నారు. దీనిపై అత్యవసరంగా భేటీ అయిన ఏఐసీసీ కోవర్టు రాజకీయం మీదనే ప్రధానంగా చర్చించినట్టు తెలిసింది. అదే సమయంలో ఢిల్లీ వచ్చిన ముఖ్యనేతపై రాహుల్‌గాంధీ సీరియస్ అయినట్టు సమాచారం.
తెలంగాణ నేతలు తమ కోవర్టు రాజకీయాలతో దేశవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పరువు తీశారని, ఇంటిదొంగలు ఉప్పందించటంతోనే మీనాక్షి కేసు విషయం బయటికి లీక్ అయిందని రాహుల్‌గాంధీ మండిపడినట్టు తెలిసింది. అధికారంలో ఉంటూ పార్టీకి చెందిన కీలకమైన నేతల ఉనికిని కాపాడలేకపోతే, ఇంకా రాష్ర్టాన్ని ఏం కాపాడుతారని ప్రశ్నించినట్టు సమాచారం. తెలంగాణలో ఉన్న నలుగురు ఎంపీలలో ఎవరిని రాజీనామా చేయిస్తావో.. చేయించి ఆరు నెలల్లోగా ఆమె ఎక్కడ పోగొట్టుకున్నదో అక్కడి నుంచే తిరిగి రాజ్యసభకు పంపాలని మాస్ వార్నింగ్ ఇచ్చినట్టు తెలిసింది.
ప్రస్తుతం తెలంగాణ నుంచి ఏడుగురు రాజ్యసభ సభ్యులు ఉన్నారు. వారిలో నలుగురు కాంగ్రెస్ నుంచి.. ముగ్గురు బీఆర్ఎస్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ నుంచి అనిల్‌యాదవ్, రేణుకాచౌదరి, అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్‌రెడ్డి ఉన్నారు. ఈ నలుగురి స్థానాల్లో ఏ ఒక సీటు రెండేండ్ల వరకూ ఖాళీ అయ్యే అవకాశం లేదు. కచ్చితంగా ఒకరు పదవీ త్యాగం చేస్తేనే మీనాక్షికి లైన్‌క్లియర్ అవుతుందని పార్టీ నేతలు భావిస్తున్నట్టు సమాచారం. రాహుల్‌గాంధీ ఆదేశాల మేరకు ఒక రాజ్యసభ ఎంపీ చేత తప్పనిసరిగా రాజీనామా చేయించాల్సిన పరిస్థితులు ఏర్పడినట్టు సీనియర్ కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు.
ఇప్పటికిప్పడు రాజీనామా అంటే.. ఈ నలుగురిలో ఎవరిని ఒప్పిస్తారనేది ఆసక్తికరంగా మారింది. దీంతో సీనియర్ కాంగ్రెస్ నేత దృష్టి ఇటీవల రాజ్యసభకు ఎన్నికైన వేం నరేందర్‌రెడ్డి మీదనే ఉన్నదని, ఇప్పటికే ఆయన ముఖ్యమంత్రి సలహాదారుగా క్యాబినెట్ హోదాలో ఉన్నారు కాబట్టి, ఆయనతో రాజీనామా చేయించాలని భావిస్తున్నట్టు తెలిసింది. ఆ స్థానంలో మీనాక్షి నటరాజన్‌కు అవకాశం కల్పిస్తే.. వంచనకు గురైన ఆమెకు సముచితమైన గౌరవం ఇచ్చినట్టు అవుతుందని, కాంగ్రెస్ పార్టీకి దేశవ్యాప్తంగా మరింత ఇమేజ్ పెరుగుతుందని సీనియర్ కాంగ్రెస్ నేత అభిప్రాయపడ్డారు.
మీనాక్షీ నటరాజన్‌ను ఎలాగైనా పెద్దల సభకు పంపాలని అధిష్ఠానం పట్టుబడుతున్న నేపథ్యంలో ముఖ్యనేత తెరవెనుక రాజకీయాలకు స్కెచ్ వేస్తున్నట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. మీనాక్షికి రాజ్యసభ బెర్త్ ఖరారు చేసే ప్రయత్నంలో తన సన్నిహితుని పదవికి ముప్పు వచ్చే ప్రమాదం ఉన్నదని పసిగట్టిన ముఖ్యనేత ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించినట్టు సమాచారం. అయితే అభిషేక్ మనుసింఘ్వీ వంటి జాతీయస్థాయి దిగ్గజాన్ని గానీ, సీనియర్ నేత రేణుకాచౌదరిని గానీ కదిలించే సాహసం చేయలేకపోవచ్చని పార్టీ నేతలు చెప్తున్నారు.
ఇక మిగిలింది ఇద్దరు. వీరిలో వేం నరేందర్‌రెడ్డి, బీసీ నాయకుడు అనిల్‌యాదవ్ మాత్రమే ఉన్నారు. వీరిలో తన సన్నిహితుడిని పదవీ గండం నుంచి తప్పించటం కోసం బీసీ ఎంపీ మీద గురి పెట్టినట్టు కాంగ్రెస్ శ్రేణుల్లో చర్చ జరుగుతున్నది. బీసీ సామాజికవర్గానికి చెందిన అనిల్‌కుమార్ యాదవ్ చేత రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయించే ఆలోచనలో పార్టీ ఉన్నట్టు ప్రచారం జరుగుతున్నది. ఆయన స్థానంలో మీనాక్షిని గెలిపించి, అనిల్‌యాదవ్‌కు రాష్ట్రస్థాయిలోనే కీలక పదవి ఇచ్చి సర్దుబాటు చేయాలని ముఖ్యనేత తెరవెనుక రాజకీయాలు చేస్తున్నట్టు తెలిసింది.