మడికొండ, జూలై 27 : కాజీపేట జంక్షన్‌కు రైల్వే డివిజన్ హోదా కల్పించాలని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్ డిమాండ్ చేశారు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న రైల్వే మాన్యుఫాక్చరింగ్ యూనిట్ (ఆర్ఎంయూ)లో స్థానికులకే 90 శాతం ఉద్యోగాలివ్వాలన్నారు. ఈ నెల 30న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన దీక్ష చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. సో మవారం కాజీపేట మీడియా పాయింట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని విధాలుగా అనువుగా ఉన్న కాజీపేటకు డివిజన్ హోదా రాకుండా ఆంధ్రా నాయకులు అడ్డుపడుతున్నారని ఆరోపించారు. కాజీపేట అభివృద్ధికి, కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అనేక ఉద్యమాలు చేశామని గుర్తుచేశారు.
జంతర్ మంతర్ వద్ద చేపట్టే నిరసన దీక్షను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర విభజన సమయంలో కేసీఆర్ దూరదృష్టితో ఆలోచించి ఉమ్మడి వరంగల్ జిల్లాకు మూడు ప్రధాన డిమాండ్లను పొందుపరిచినట్లు చెప్పారు. రాష్ట్ర ఏర్పాటు తర్వాత కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు సాధ్యం కాదని తేల్చి చెప్పడంతో గల్లీ నుంచి ఢిల్లీ వరకు నిరసనలు చేపట్టామన్నారు. దీంతో కాజీపేటకు పీవోహెచ్ మంజూరు చేసి 50 ఎకరాల భూమి కావాలని కేంద్రం కోరితే అప్పటి సీఎం కేసీఆర్ భవిష్యత్ అవసరాల దృష్ట్యా 160 ఎకరాల స్థలాన్ని కేటాయించినట్లు తెలిపారు. ప్రస్తుతం అదే స్థలంలో కోచ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేశారన్నారు.
పొరుగు రాష్ర్టాల్లో ఏర్పాటు చేసిన రైల్వే పరిశ్రమల్లో 80 శాతం స్థానికులకే ఉద్యోగాలిచ్చారని, ఇక్కడ సైతం కల్పించాలన్నారు. సికింద్రాబాద్ డివిజన్లో అత్యధిక ఆదాయాన్ని అందించే కాజీపేటను డివిజన్‌గా ఏర్పాటు చేయాలన్నారు. నిరసన దీక్ష అనంతరం రైల్వే ఉన్నతాధికారులకు వినతిపత్రం అందజేస్తామన్నారు. ఉద్యోగాలు, డివిజన్ సాధించేవరకు తమ పోరాటం ఆగదని, అవసరమైతే ఉద్యమం చేపడుతామని స్పష్టం చేశారు. స్థానిక చిరు వ్యాపారులు, ఆటో కార్మికులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందన్నారు. సమావేశంలో మాజీ కార్పొరేటర్లు జోరిక రమేశ్, సంకు నర్సింగరావు, నాయకులు సుంచు కృష్ణ, నార్లగిరి రమేశ్, పోలపల్లి రామ్మూర్తి, గబ్బెట శ్రీనివాస్, పాము రాజేశ్, తేలు సారంగపాణి, మహమూద్ పాల్గొన్నారు.