హైదరాబాద్, ఆగస్టు 7( నమస్తే తెలంగాణ) : ‘రాహుల్‌గాంధీ డిన్నర్‌కు రమ్మని పిలిచారు.. వెళ్తున్న’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీలో విలేకరుల సమావేశం పెట్టి మరీ ప్రకటించారు. 18 నెలలుగా అపాయింట్మెంట్ ఇవ్వని రాహుల్ ఏకంగా డిన్నర్‌కు పిలవడంపై ఢిల్లీ జర్నలిస్టులు కూడా ఆశ్చర్యపోయారట. విలేకరులకు అనుమానాలేవీ రాకుండా ఉండటానికి సీఎం సన్నిహిత ఎంపీలు కొందరు కల్పించుకొని, ఏఐసీసీ కార్యదర్శి కేసీ వేణుగోపాల్ విందు ఏర్పాట్లను కో ఆర్డినేట్ చేస్తున్నారని, ‘42% బీసీ రిజర్వేషన్ల మీద కేంద్రంపై ఎట్లా ఒత్తిడి చేద్దాం’ అనే అంశం మీదనే ప్రధానంగా చర్చ జరుగనున్నదనే ప్రచారాన్ని విలేకరుల సమావేశంలోకి చొప్పించినట్టు సమాచారం. అయితే, రాహుల్ విందుపై అవగాహన ఉన్న స్థానిక విలేకరులు సమావేశం అనంతరం ఆరా తీయగా.. ఇది కూడా సీఎం రేవంత్‌రెడ్డిని మెచ్చుకుంటూ సోనియా రాసిన ఉత్తరం తరహా ప్రోగ్రాం లాంటిదేనని తేలింది.
వాస్తవానికి జరిగింది ఏమిటంటే.. బీహర్‌లో అధికార పార్టీకి మద్దతుగా ఎన్నికల కమిషన్ 65 లక్షల ఓట్లను తొలిగించిందనే ఆరోపణలపై పార్లమెంటులో చర్చించాలని కాంగ్రెస్ పార్టీ పట్టుబడుతున్నది. ఇదే అంశంపై శుక్రవారం నిరసన తెలపాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా రాహుల్ గురువారం విందు ఏర్పాటుచేశారు. ఈ విందుకు రావాల్సిందిగా ఇండియా కూటమి, ఏఐసీసీలోని కీలక నేతలను ఈ నెల 4న ఆహ్వానించినట్టు తెలిసింది. ఈ ఆహ్వానం అందుతుందని రేవంత్ సన్నిహితవర్గం భావించింది. దీంతో సీఎం 7 వరకు ఢిల్లీలో ఉండేటట్టు నిర్ణయించుకున్నారు. ఒకవేళ రాహుల్ నుంచి ఆహ్వానం అందకపోతే, కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి కూతురు జయారెడ్డి వివాహానికి హజరయ్యే విధంగా షెడ్యూల్ ఫిక్స్ చేసుకున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆమేరకు ఢిల్లీ నుంచి వచ్చేందుకు విమాన టికెట్లు కూడా ఏర్పాటుచేసుకున్నట్టు సమాచారం. గురువారం ఉదయం వరకు రాహుల్ నుంచి విందు ఆహ్వానం అందలేదని, దీంతో కేసీ వేణుగోపాల్ మంత్రాంగం నెరిపి రేవంత్‌కు ఆహ్వానం పంపినట్టు ఢిల్లీ కాంగ్రెస్ వర్గాలు చెప్తున్నాయి.