Caste Census | హైదరాబాద్, నవంబర్7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీ లోక్‌సభా పక్ష నేత రాహుల్‌గాంధీ ప్రవచిస్తున్నది ఒకటి. రాష్ట్రం లో కాంగ్రెస్ శాసనసభా నాయకుడు, సీఎం రేవంత్‌రెడ్డి అనుసరిస్తున్నది మరొకటి. ప్రజాకులగణన నిర్వహించాలని రాహుల్‌గాంధీ మొత్తుకుంటుంటే, అందుకు పూర్తిభిన్నంగా బ్యూరోక్రటిక్ కులగణనను నిర్వహిస్తున్నది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పుడిదే బీసీ వర్గాల్లో, రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారిం ది. అధినేత చెబుతున్న దానికి విరుద్ధంగా రా ష్ట్ర కాంగ్రెస్ నేతలు ఇంటింటి సర్వేను ఆది నుంచీ ముందుకు తీసుకెళ్లడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుత సర్వే ప్రామాణికతపైనా ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. క్షేత్రస్థాయిలో సర్వే కోసం ఇండ్లకు స్టిక్కరింగ్ చేయడాన్నే పలువురు వ్యతిరేకిస్తున్నారంటే వివరా లు ఎలా ఇస్తారు? సేకరించే డేటాకు కచ్చిత త్వం ఎలా ఉంటుందని ప్రశ్నలు తలెత్తుతున్నా యి. మొత్తంగా సర్వే ఉద్దేశం నెరవేరుతుందా? అనే అనుమానాలను తెలంగాణ సమాజం లేవనెత్తుతున్నది.
కులగణన అంశంపై ప్రజాసంఘాలు, కుల సంఘాలు, సామాజికవేత్తల అభిప్రాయాలను తెలుసుకునేందుకు కాంగ్రెస్ లోక్‌సభా పక్షనేత రాహుల్‌గాంధీ ఇటీవల హడావుడిగా రాష్ర్టానికి వచ్చారు. మేధావివర్గం, ప్రజాసంఘాలు, కులసంఘాల నేతలతో ప్రత్యేకంగా భేటీ అయి సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కులగణన ఏ రీతిలో ఉండాలి? ఏ విధానాలను అవలంబించాలి? ఏ పద్ధతిలో సర్వే నిర్వహించాలనే అంశాలపై చాలా స్పష్టంగా నొక్కిచెప్పారు. అధికారయంత్రాంగం తీర్చిదిద్దిన ప్రశ్నావళితో, నియమ నిబంధనలతో కులసర్వేను నిర్వహించవద్దని నొక్కిచెప్పారు. ప్రజల ఆలోచనలకు అనుగుణంగా ప్రశ్నలు రూపొందించి, అవసరమైతే వారి నుంచే ప్రశ్నావళిని స్వీకరించి ప్రజాకులగణనను నిర్వహించాలని ఘంటాపథంగా తెలిపారు. రేవంత్‌రెడ్డి సర్కారు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్కు బాధ్యతలను అప్పగించడమేగాక, ఆ విభాగం రూపొందించిన ప్రశ్నావళితోనే సర్వేకు సిద్ధమైందని సామాజికవేత్తలు మండిపడుతున్నారు.
ఇంటింటి సర్వేకు ప్లానింగ్ డిపార్ట్మెంట్ రూపొందించిన ప్రశ్నావళిపై కుల సంఘా లు, కార్మిక సంఘాలు అభ్యంతరాలను వ్య క్తం చేశాయి. విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులను ఒకే కులస్తులుగా పరిగణించాలని రాష్ట్ర విశ్వబ్రాహ్మణ విశ్వకర్మ మాతృ సం ఘం డిమాండ్ చేస్తున్నది. ఎన్యూమరేషన్ ఫార్మాట్లో విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మలను కులంగా కాకుండా వృత్తులుగా పేరొనడం పై అభ్యంతరం వ్యక్తం చేసింది. సంప్రదాయ వృత్తులైన కమ్మరం, వడ్రంగం, ఇత్తడి, శిల్పి, స్వర్ణకార వృత్తులను నిర్వహిస్తున్న వారందరినీ విశ్వ బ్రాహ్మణ విశ్వకర్మ జాతీయులుగానే గుర్తించాల్సి ఉన్నా, సర్వే ప్రశ్నావళిలో పంచవృత్తులకు బదులుగా కేవలం కమ్మ రం, వడ్రంగి, స్వర్ణకార వృత్తులనే కులాలుగా ముద్రించడాన్ని ఆక్షేపించింది. ఇప్పటికైనా సవరించాలని ఆ సంఘం డిమాండ్ చేస్తున్నది. సర్వేకు సంబంధించి తెలంగాణ గిగ్, ప్లాట్ ఫామ్ వరర్స్ యూనియన్ కూ డా పలు సూచనలు ముందుపెట్టింది.
‘రోజువారీ వేతన కార్మికులు’ అనే కోడ్ శీర్షికను ‘అసంఘటిత విభాగం కార్మికులు/వేతన కార్మికులు’గా మార్చాలని, అనధికార ఉద్యోగుల విసృ్తత స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలో ఉపయోగపడుతుందని తెలుపుతున్నది. ‘అసంఘటిత విభాగం కార్మికులు/వేతన కార్మికులు’గా కోడ్4లోనే వర్గీకరించాలని డిమాండ్ చేస్తున్నది. అలాగే వ్యక్తిగత వివరాలు, ఇంటి నిర్మాణ స్థలం, ఇంట్లో ఉన్న గదుల సంఖ్యను కూడా అడగడంపై జనం ఆక్షేపిస్తున్నారు. ఇంట్లో దంపతులు తీసుకున్న రుణాల వివరాలపైనా సర్వే ప్రశ్నావళిలో వేర్వేరుగా ఉన్నది. అత్యవసర పరిస్థితులు, సందర్భాలను బట్టి రుణాలు తీసుకుంటారు.. కొన్ని సందర్భాల్లో వ్యక్తిగత సంబంధాల ఆధారంగా కాగితాలు లేకుండానే రుణాలు పొందుతారు.. దీనిపై కచ్చితత్వం ఎలా ఉంటుందని అనుమానాలు వ్యక్తంచేస్తున్నారు. ఇవేగాకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ కుల సంఘాలు సైతం ఆమోదయోగ్యమైన, అర్థవంతమైన, సహేతుకమైన అనేక సూచనలను ప్రభుత్వం ముందు పెట్టాయి. అయినప్పటికీ ఇటు ప్రభుత్వం, అటు ప్లానింగ్‌బోర్డు ఏమాత్రం పట్టించుకోకుండా సర్వేను ముందుకు తీసుకెళ్లడంపై మేధావివర్గం నిప్పులు చెరుగుతున్నది.