Rahul Gandhi | హైదరాబాద్, నవంబర్ 2 (నమస్తే తెలంగాణ): ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన చందంగా ఉన్నది కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ తీరు. మేడిగడ్డ బరాజ్‌కు ఏదో జరిగిపోయిందంటూ పెడబొబ్బలు పెడుతూ దాన్ని పరిశీలించేందుకు వెళ్లిన ఆయన… చివరికి దానిపై ఉండే ఎక్స్పాన్షన్ జాయింట్‌ను చూసి పగుళ్లు ఏర్పడినట్టు భ్రమపడ్డారు.
అంతటితో ఆగకుండా తన తెలివితక్కువ తనాన్ని ప్రపంచానికి కూడా తెలియజేసేందుకు అక్కడ దిగిన ఫొటోలను తన ఎక్స్(ట్విట్టర్)లో పోస్ట్ చేసి బరాజ్ పిల్లర్లకు పగుళ్లు వచ్చాయని పచ్చి అబద్ధాలను రాసుకొచ్చారు. దీంతో ఈ ఫొటోలను చూసిన నెటిజన్లు రాహుల్‌గాంధీపై దుమ్మెత్తి పోస్తున్నారు. పగుళ్లకు, ఎక్స్పాన్షన్ జాయింట్‌కు తేడా తెలియని సన్నాసి రాహుల్ అంటూ ఎద్దేవా చేస్తున్నారు. ముందు అవి పగుళ్లు (క్రాక్) కాదని, బ్రిడ్జిలు, ైప్లెఓవర్ల నిర్మాణంలో సాధారణంగా కనిపించే ఎక్స్పాన్షన్ జాయింట్స్ అని తెలుసుకో అంటూ చురకలంటిస్తున్నారు. ‘అందుకే రాహుల్… నిన్ను పప్పు అనేది’ అంటూ ఎద్దేవా చేస్తున్నారు.
ఎక్ప్పాన్షన్ జాయింట్స్ చిత్రాలను షేర్ చేస్తూ ‘ఇవే నువ్వు చూపించిన పగుళ్లు’ అని రాహుల్‌పై సెటైర్లు వేస్తున్నారు. ఇక రాహుల్‌గాంధీని గతంలో రేవంత్‌రెడ్డి ‘రాహుల్ గాంధీ పప్పు కాదు.. ముద్ద పప్పు’ అన్న వ్యాఖ్యల్ని జోడించి… నిజమే! రేవంత్‌రెడ్డి చెప్పినట్టు రాహుల్‌గాంధీ పప్పు కాదు.. ముద్ద పప్పు అనేది తేలిపోయిందంటూ కామెంట్లు చేస్తున్నారు. రేవంత్‌రెడ్డిని కూడా ఓ ఆటాడుకున్నారు. రాహుల్‌గాంధీ పోస్ట్ చేసిన ఫొటోలో ఎక్స్పాన్షన్ జాయింట్‌ను రేవంత్‌రెడ్డి చూపుతున్నట్టుగా ఉన్నది. దీంతో మరోసారి రేవంత్‌రెడ్డి రాహుల్‌గాంధీని బక్రా చేశాడు. పప్పును చేశాడు అంటూ సెటైర్లు వేస్తున్నారు.
పావుగంట కోసం ఇంత పరుగా?
బరాజ్ సందర్శన పేరుతో తెగ హడావిడి చేసిన రాహుల్‌గాంధీ బ్యాచ్.. అక్కడి అలా వచ్చి రెండు ఫొటోలు తీసుకొని ఇలా వెళ్లిపోయారు. హఠాత్తుగా రాత్రికి రాత్రే మేడిగడ్డ పర్యటన ఖరారు చేశారు. మేడిగడ్డ ప్రాజెక్టును చూసేందుకు అంబట్పల్లిలో మహిళా సదస్సు పేరిట కొత్త నాటకమాడారు. ఈ సాకుతో పార్టీ నాయకులను, కార్యకర్తలను అంబట్పల్లికి తరలించారు. ఉదయం 8:15కు మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు హెలికాప్టర్లో చేరుకున్న రాహుల్‌గాంధీ, నేరుగా కారులో అంబట్పల్లి మహిళా సదస్సుకు చేరుకొని, 15 నిమిషాల్లో ప్రసంగం ముగించి మళ్లీ మేడిగడ్డ ప్రాజెక్టు వద్దకు వెళ్లి రేవంత్‌రెడ్డితో కలిసి ఫొటో దిగి వెళ్లిపోయారు. సదస్సు పావుగంటలో పూర్తవటంతో అసలు మమ్మల్ని ఎందుకు పిలిచారు? ఈ మీటింగ్ ఎందుకు పెట్టారు? అని మహిళలు మండిపడుతూ వెళ్లడం కనిపించింది.
అసలేంటీ ఎక్స్పాన్షన్ జాయింట్
ప్రతి బ్రిడ్జి, ఫైఓవర్, సీసీ రోడ్ల నిర్మాణంలో తప్పనిసరిగా ఈ ఎక్స్పాన్షన్ జాయింట్స్‌ను వదులుతారు. ఇందుకు కారణం ఆ బ్రిడ్జి లేదా ఫ్లైఓవర్ ఉష్ణోగ్రతల సమతుల్యతను తట్టుకొనేందుకు, పొడవును సరి చేసేందుకు, బ్రిడ్జి భాగాలను అనుసంధానం చేసేందుకు దీన్ని ఏర్పాటు చేస్తారు. అందుకే బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల మధ్యమధ్యలో ఈ జాయింట్స్ కనిపిస్తాయి. ఈ జాయింట్స్ లేకుండా బ్రిడ్జిలు, ఫ్లైఓవర్ల నిర్మాణం చేయలేరు. ఒకవేళ చేసినా అవి నిలబడవు. ఈ విషయం కూడా తెలియకుండా రాహుల్‌గాంధీ ఎక్స్పాన్షన్ జాయింట్స్ వద్ద ఫొటో దిగి దాన్నే పగులుగా చిత్రీకరించే ప్రయత్నం చేశారు.