Congress | హైదరాబాద్, ఫిబ్రవరి 28 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో సీఎం రేవంత్‌రెడ్డికి చెక్ పెట్టేందుకే కాంగ్రెస్ అధిష్ఠానం మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపిందా? పార్టీ పరంగా, పాలనాపరంగా రేవంత్‌రెడ్డి ఒంటెద్దు పోకడలను నియంత్రించేందుకే ఆమెను నియమించారా? సీనియర్ల వరుస ఫిర్యాదులతో రాహుల్‌గాంధీకి వాస్తవాలు బోధపడి మీనాక్షిని తెలంగాణకు పంపించారా? ప్రస్తుతం రాష్ట్ర కాంగ్రెస్ పార్టీలో తీవ్రంగా చర్చించుకుంటున్న అంశాలు ఇవి. దీపాదాస్ మున్షీని అర్ధంతరంగా తప్పించి రాహుల్‌గాంధీకి అత్యంత సన్నిహితురాలు, నమ్మకస్తురాలైన మీనాక్షి నటరాజన్‌ను రంగంలోకి దింపడంపై అటు కాంగ్రెస్‌లో ఇటు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. ఇప్పటికే సీఎం రేవంత్‌రెడ్డిని రాహుల్‌గాంధీ పక్కన పెట్టారని, అందుకే ఢిల్లీకి ఎన్నిసార్లు వెళ్లినా కనీసం అపాయింట్మెంట్ ఇవ్వడం లేదని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్‌రెడ్డిని పూర్తిగా నియంత్రించాలన్న లక్ష్యంతోనే తన నమ్మకస్తురాలిని తెలంగాణకు పంపారని గుసగుసలు వినిపిస్తున్నాయి.
వరుస ఫిర్యాదులు.. వరుస ప్లాపులు
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటిరోజు నుంచే సీఎం రేవంత్‌రెడ్డిపై అధిష్ఠానానికి సీనియర్లు ఫిర్యాదులు చేయడం మొదలు పెట్టారు. మొదట్లో ఈ ఫిర్యాదులను ఢిల్లీ పెద్దలు పెద్దగా పట్టించుకోకపోయినా.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకుని ఉన్న సీనియర్ నేతలు తమ ఆవేదనను వెళ్లగక్కడంతో ఢిల్లీ పెద్దల్లో ఆలోచన మొదలైందని సమాచారం. అందుకే రేవంత్‌రెడ్డి ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్లినా మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల నియామకాన్ని పక్కన పెట్టినట్టు చెప్పుకొంటున్నారు. మరోవైపు అసంబద్ధ నిర్ణయాలతో కొంతకాలానికే ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరగడంపై అధిష్ఠానం గుర్రుగా ఉన్నదని సమాచారం. కనీసం ధైర్యంగా స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లలేని స్థితిపై ఢిల్లీ పెద్దలు ఆగ్రహంతో ఉన్నట్టు తెలిసింది. ఏకంగా 10 మంది ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశమై ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేలా చర్చలు జరపడంపై అధిష్ఠానం షాక్‌కు గురైనట్టు కాంగ్రెస్ వర్గాలు తెలిపాయి. ఈ పరిణామాలకు దారితీసిన కారణాలపై లోతుగా విశ్లేషించినట్టు సమాచారం. సీఎం ఒంటెత్తు పోకడల వల్లే ఈ పరిస్థితి వచ్చినట్టు నివేదిక అందిందని తెలిసింది. రేవంత్‌పై కొందరు నేతలు బహిరంగంగా విమర్శలు చేయడం సైతం అధిష్ఠానం దృష్టికి వెళ్లినట్టు తెలిసింది. అధిష్ఠానానికి తెలియకుండానే హైడ్రా ఏర్పాటు వంటి నిర్ణయాలను తీసుకున్నారని ప్రచారం జరుగుతున్నది. మంత్రుల మధ్య సఖ్యత సాధించడంలోనూ రేవంత్ విఫలమయ్యారని అధిష్ఠానం భావిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే రేవంత్‌కు చెక్ పెట్టేందుకు రాహుల్ మీనాక్షి ని రంగంలోకి దింపారని చర్చించుకుంటున్నారు.
దీపాదాస్ పై ఆరోపణలు..
కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జిగా పనిచేసిన దీపాదాస్ మున్షీపై అనేక ఆరోపణలు వెల్లువెత్తిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం రేవంత్‌రెడ్డితో చేతులు కలిపారని, దీంతో ఆమె రాష్ట్ర వ్యవహారాల్లో పెద్దగా జోక్యం చేసుకోవడం లేదన్న ఫిర్యాదులు ఢిల్లీకి అందినట్టు సమాచారం. దీంతో అటు ప్రభుత్వపరంగా ఇటు పార్టీపరంగా రేవంత్‌రెడ్డి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారని సీనియర్ నేతలు అధిష్ఠానానికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే దీపాదాస్‌ను తప్పించినట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా రేవంత్‌రెడ్డి తన వ్యవహార శైలి మార్చుకోకపోతే భవిష్యత్తులో పరిణామాలు తీవ్రంగా ఉండే అవకాశం ఉన్నదని గుసగుసలు వినిపిస్తున్నాయి.