హైదరాబాద్: ఎస్ఎల్బీసీ సొరంగ మార్గంలో చిక్కుకున్న వారిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నది. టన్నెల్ వద్ద జరుగుతున్న సహాయక చర్యల గురించి కాంగ్రెస్ అగ్రనేత, లోక్సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi).. సీఎం రేవంత్ రెడ్డికి ఫోన్ చేసి తెలుసుకున్నారు. బాధితులను రక్షించేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. ఇరువు నేతలు దాదాపు 20 నిమిషాలపాటు మాట్లాకున్నారు. ఘటన జరిగిన వెంటనే మంత్రి ఉత్తమ్ అక్కడికి వెళ్లారని, అక్కడే ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని చెప్పారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆరపరేషన్లో పాల్గొంటున్నాయన్నారు. క్షతగాత్రులకు చికిత్స అందిస్తున్నట్లు వివరించారు. సొరంగంలో చిక్కుకున్న వారిని రక్షించేందుకు అన్ని ప్రయత్నాలు చేయాలని రాహుల్ సూచించారు.
అయితే ప్రమాదం జరిగి 24 గంటలు గడుస్తుండటం, సహాయక చర్యలకు ఆటంకాలు ఏర్పడటంతో సొరంగంలో చిక్కుకున్నవారు సజీవంగా ఉన్నారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఘటనా స్థలంలో పెద్దమొత్తంలో బురద పేరుకుపోవడం, నీరు ఊరుతున్నది. కరెంటు సరఫరా నిలిచిపోవడంతోపాటు ఆక్సిజన్ సరఫరా లేకపోవడంతో సందేహం నెలకొన్నది. సహాయక చర్యల్లో 24 మందితో కూడిన ఆర్మీ బృందం పాల్గొంటున్నది. అదేవిధంగా 130 మంది ఎన్డీఆర్ఎఫ్, 24 మంది హైడ్రా బృందం, 24 మందితో కూడిన సింగరేణి కాలరీస్ రెస్క్యూ టీమ్, 120 మంది ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొంటున్నారు.