హైదరాబాద్, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో ఏం జరుగుతున్నది? పార్టీలో పరిస్థితి ఎలా ఉంది? సర్కారుపై ప్రజల ఏమనుకుంటున్నారు? ఇలా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ ఆరా తీసినట్టుగా తెలుస్తున్నది. ఈ మేరకు శనివారం ఢిల్లీలో రాహుల్‌తో టీపీసీసీ సీనియర్‌నేత మధుయాష్కీగౌడ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇద్దరి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చినట్టుగా రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కులగణన అంశాలపై మధుయాష్కీ రాహుల్‌కు వివరించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా రాహుల్ సైతం పలు అంశాలపై మధుయాష్కీ ద్వారా ఆరా తీసినట్టు ప్రచారం జరుగుతున్నది. పార్టీలో, ప్రభుత్వంలో అంతర్గతంగా చోటుచేసుకుంటున్న పరిణామాలపైనా అడిగి తెలుసుకున్నట్టు తెలిసింది. ఇటీవల రాహుల్‌గాంధీని కలిసిన సీఎం రేవంత్‌రెడ్డి కులగణన, పథకాల అమలులపై నివేదించారని పార్టీ వర్గాలు తెలిపాయి. అయితే ఆ వివరాలను మధుయాష్కీ చెప్పిన విషయాలతో రాహుల్ క్రాస్ చెక్ చేసుకున్నట్టుగా తెలిసింది. రాష్ట్ర కార్యవర్గ ఏర్పాటులో పదవులపైనా చర్చించినట్టుగా సమాచారం.