మాగనూరు, నవంబర్ 26 : ‘పెద్దవాగును రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ తోడేస్తున్నది.. అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్నారు.. ఇదంతా అధికారుల అండలోనే కొనసాగుతున్నది’.. అంటూ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశారు. బుధవారం నారాయణపేట జిల్లా మాగనూరు మండల కేంద్రానికి సమీపంలో ఇసుక తరలిస్తున్న టిప్పర్‌ను అడ్డుకొని అనుమతి పత్రాలు చూపించాలని అడిగారు. ఎలాంటి పర్మిషన్ లేకపోవడంతో కలెక్టర్ సీసీతో ఫోన్లో మాట్లాడారు. మాగనూరు పెద్దవాగులో రాఘవ కన్స్ట్రక్షన్కు అనుమతులు ఇచ్చారా? అని అడిగితే ఎలాంటి అనుమతులు లేదని చెప్పినట్లు చిట్టెం తెలిపారు. గ్రామస్థులు మరో ఇసుక టిప్పర్‌ను అడ్డుకున్నారు.
ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ, పట్టపగలే మాగనూరు పెద్ద వాగు నుంచి టిప్పర్ల ద్వారా యథేచ్ఛగా ఇసుక తరలిపోతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పథకం పనుల పేరుతో ఇసుక అక్రమ రవాణా జోరందుకున్నదని ఆరోపించారు. ఈ పథకానికి మద్రాస్ హైకోర్టులోనే పర్మిషన్ లేదని, ఇసుక రవాణా నిలిపివేయాలని కోర్టు ఆదేశాలు ఇచ్చినట్టు తెలిపారు. ఇసుక తరలింపును అడ్డుకోవాలని మాగనూరు ఎస్సై, సీఐ, తహసీల్దార్‌కు లేఖలు పంపించినట్టు చెప్పారు. ఇసుక అనుమతి లేకుండా ఎలా తరలిస్తారని ఏఎస్సైతో గ్రామస్థులు వాగ్వాదానికి దిగారు. తహసీల్దార్ సురేశ్ ఆదేశా ల మేరకు ఒక ట్రిప్పర్‌ను పీఎస్‌కు తరలించగా, గంటలోనే అనుమ తి పత్రాలు చూ పించడంతో ఇసుక టిప్పర్‌ను వదిలేసినట్టు ఎస్సై తెలిపారు.
హైదరాబాద్, నవంబర్ 26 (నమస్తే తెలంగాణ): స్థానిక ఎన్నికల కోడ్ సాకుతో ల్యాబ్ టెక్నీషియన్స్ గ్రేడ్-2 అభ్యర్థుల కౌన్సెలింగ్, ఆర్డర్ కాపీలు ఇచ్చే ప్రక్రియను వా యిదా వేయడం సరికాదని అభ్యర్థులు పేర్కొన్నారు. బుధవారం కోఠిలోని డైరెక్టర్ ఆఫ్ హెల్త్ (డీహెచ్) కార్యాలయం ఎదుట అభ్యర్థులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ పోస్టులకు రెండేండ్ల క్రితం నోటిఫికేషన్ వచ్చిందని, ఇప్పటికే మూడుసార్లు ఎలక్షన్ కోడ్ అని చెప్పి ప్రక్రియను వాయిదా వేశారని వాపోయారు. తమకు న్యాయం చేయాలని కోరారు.