US Cop | హైదరాబాద్ (నమస్తే తెలంగాణ): అమెరికా పోలీసుల జాత్యాహంకార ధోరణి మరోసారి బయటపడింది. సియాటెల్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో చనిపోయిన తెలుగు విద్యార్థిని కందుల జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ దర్యాప్తు అధికారి చేసిన ఎగతాళి అమెరికాలో దుమారం రేపింది. భారతీయ విద్యార్థుల ప్రాణాలకు విలువ లేదంటూ ఓ పోలీసు అధికారి వ్యవహరించిన తీరుపై ప్రవాస భారతీయులు, నెటిజన్లు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఈనేపథ్యంలో సదరు పోలీస్ అధికారి, సహ ఉద్యోగిపై సియాటెల్ పోలీస్ శాఖ విచారణకు ఆదేశించింది. కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి సౌత్లేక్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో చదువుకుంటున్నది.
ఈ ఏడాది జనవరి 23న రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ వాహనం ఆమెను ఢీకొంది. ఈ ప్రమాదంలో జాహ్నవి తీవ్రగాయాలతో అకడికకడే చనిపోయింది. ఈ క్రమంలో జాహ్నవి మృతిపై సియాటెల్ పోలీసు అధికారుల గిల్డ్వైస్ ప్రెసిడెంట్ డేనియల్ ఆడెరెర్ కారు నడుపుతూ చేసిన సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి తాజాగా వెలుగు చూసింది. గిల్డ్ అధ్యక్షుడు మైక్సోలన్తో ఫోన్లో ఆడరర్ మాట్లాడుతూ జాహ్నవి విలువ చాలా తకువ అంటూ ఆమె ప్రాణానికి విలువే లేదంటూ ఎగతాళిగా కామెంట్ చేశాడు. ఆమె చనిపోయింది అంటూ గట్టిగా నవ్వడమే గాక.. ఇదంతా మామూలే అంటూ భారతీయ విద్యార్థిని మరణాన్ని చాలా తేలిగ్గా తీసిపారేశాడు.
ఆమెకు 26 ఏళ్లు. 11,000 డాలర్లకు చెక్ రాస్తే చాలు. ఆమె విలువ చాలా తకువ అంటూ ఆడెరర్ చేసిన వ్యాఖ్యలు.. అమెరికన్ పోలీసు జాత్యాహంకార ధోరణిని తెలుపుతున్నది. కారును గంటకు 50 మైళ్ల వేగంతో నడుపుతున్నాడని, ఒక శిక్షణ పొందిన డ్రైవర్‌కు అది చాలా తకువ వేగమని కూడా ఆడరర్ సర్టిఫై చేశాడు. అయితే, జాహ్నవి మరణంపై పోలీసులు జరిపిన దర్యాప్తులో ఆ అధికారి గంటకు 74 మైళ్ల వేగంతో కారు నడిపినట్లు తేలింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో గంటకు 25 మైళ్లకు మించి వేగంగా వాహనాలు నడపడానికి వీల్లేదు. వేగంగా నడిపిన కారు ఢీకొని.. జాహ్నవి 100 అడుగుల మేర దూరంలో ఎగిరిపడి మరణించింది. ఆడెరర్ వీడియో సంభాషణకు సంబంధించిన వీడియోపై నెటిజన్లు, ప్రవాస భారతీయలు మండిపడుతున్నారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు సియాటెల్ పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.