హైదరాబాద్ : అసమర్ధ కాంగ్రెస్ పాలనలో తెలంగాణలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రతి వారం ఒక బిడ్డ చనిపోతుందని బీఆర్ఎస్ నాయకుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా పాలన పేరుతో అధికారంలోకి వచ్చిన రేవంత్ సర్కార్ ప్రజల ఉసురు తీసుకుంటుందని మండిపడ్డారు. రాష్ట్రంలో ప్రతి వారం ఒక ఆటో డ్రైవర్, ఆరుగురు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు.
ప్రతి వారం 17 పాఠశాలలు మూత పడుతున్నాయి. కానీ ప్రతిరోజూ కాంగ్రెస్ పాలకులు రూ.25 కోట్లు వాళ్ల జేబుల్లో వేసుకుంటున్నారని విమర్శించారు. రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి 373 ఎకరాల భూమిని నాదర్గుల్లో కబ్జా చేశారు. స్థానిక రైతులను ముప్పు తిప్పలు పెడుతున్నారు. అందుకే ప్రజలందరు మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారని తెలిపారు. అవినీతి కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పి బీఆర్ఎస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు.