మహానగరం నిషేధిత జాబితాలో చేరింది. 22-ఏ అనే పదం వింటేనే నగర ప్రజలు వణికిపోతున్నారు. జీవితకాలం కష్టార్జితంతో సంపాదించుకున్న ఇల్లు, స్థలం, ఆస్తిపై హక్కులు కోల్పోయి తీవ్రమైన ఆందోళనలో ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఎక్కడ చూసినా ఏ ఇద్దరు కలిసినా నిషేధిత జాబితాపైనే చర్చ జరుగుతున్నది. నగరంలోని ఏ ఇల్లు నిషేధిత జాబితాలో ఉన్నదో తెలియని గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. గ్రేటర్ పరిధిలో లక్షకు పైగానే ప్రాపర్టీలు రెవెన్యూ రికార్డుల ప్రకారం 22-ఏ జాబితాలో చేర్చినట్లు తెలుస్తున్నది. ఎలాంటి నోటీసులు, ప్రకటనలు లేకుండా గుట్టుచప్పుడు కాకుండా ప్రజల కష్టార్జితంతో అన్ని అనుమతులతో కొనుక్కున్న నిర్మాణాలు, స్థలాలను రెవెన్యూ అధికారులు నిషేధిత జాబితా 22-ఎలోని యూఎల్సీ, జీ సర్కారీ పేరిట చేర్చేశారు.
– సిటీబ్యూరో, ఆగస్టు 11 (నమస్తే తెలంగాణ)
ఏదైనా అత్యవసర పరిస్థితుల వల్ల ఇల్లు అమ్ముకుందామంటే కొనేవారికి రిజిస్ట్రేషన్ కావడం లేదు తమ ఇండ్లు, స్థలాలను రిజిస్ట్రర్డ్ లీజ్ డీడ్ చేద్దామన్నా అవకాశం లేకుండా పోయింది. గ్రేటర్ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. ఏండ్ల తరబడిగా పైసాపైసా కూడబెట్టుకుని కొనుక్కున్న ఇండ్లు.. తమ కష్టారితంతో కట్టుకున్న తమ కలల సౌధం.. ఉద్యోగాలు చేసుకుని లోన్లు తీసుకుని కొనుక్కున్న ఫ్లాట్లు నిషేధిత జాబితాలో చేరడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నగరంలోని వెంచర్లు, సొసైటీలు, కాలనీలు, బహుళ అంతస్థుల భవనాలు నిషేధిత జాబితాలోకి చేరాయి. హైదరాబాద్, మేడ్చల్, రంగారెడ్డి జిల్లాల పరిధిలోని విలువైన భూములు, బహుళ అంతస్థుల భవనాలు ఫ్రీజ్ అయిపోయాయి. అవన్నీ బయటకు రావడం కష్టమేనని రెవెన్యూ అధికారులు సైతం తేల్చి చెప్తుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. సిటీలోని కొన్ని దశాబ్దాల కిందట ఏర్పాటుచేసిన సొసైటీలు కూడా నిషేధిత జాబితాలో చేరాయి.
హైదరాబాద్‌లోని ఎర్రగడ్డ పరిధిలోని వాసవి, జనప్రియ, కల్పతరు, బ్రిగేడ్ సిటాడెల్ అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలోకి చేరాయి. ఈ అపార్ట్మెంట్లలో 5 వేలకు పైగా కుటుంబాలు నివసిస్తున్నారు. అదేవిధంగా యూసుఫ్‌గూడ విలేజ్ పరిధిలోని కల్యాణ్‌నగర్ హౌసింగ్ సొసైటీ మొత్తాన్ని నిషేధిత జాబితాలో చేర్చారు. బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్, ఎమ్మెల్యే కాలనీ, పంజాగుట్ట, శ్రీనగర్ కాలనీ, జూబ్లీహిల్స్, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట, ఖైరతాబాద్ ప్రాంతాల్లోని వందలాది ఇండ్లను ఇదే తరహాలో 22ఏ జాబితాలో చేర్చారు. ఆయా ప్రాంతాల్లో నివసించేవారు తమ అత్యవసరాలకు ఇండ్లను అమ్ముకునేందుకు రిజిస్ట్రేషన్ ఆఫీసుకు వెళ్తే ఒల్లు గగుర్పొడిచే విషయాలు బయటపడ్డాయి. అదేవిధంగా ఫతేనగర్ పరిధిలోని సనత్‌నగర్ ఇండస్ట్రియల్ ఏరియాను ఉమ్మడి రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రెసిడెన్షియల్ ప్రాంతంగా గుర్తించింది. ఇప్పుడు ఆప్రాంతమంతా నిషేధిత జాబితాలో చేర్చారు. అదేవిధంగా ఉప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని స్వరూప్నగర్తో పాటు పలు కాలనీల్లో కలిపి దాదాపు వెయ్యి ఎకరాలు కనుమరుగయ్యాయి. ఈ భూములన్నీ నిషేధిత జాబితాలో చేరాయి. ఎన్వోసీ ఉంటేనే రిజేస్ట్రేషన్ చేస్తామని రెవెన్యూ అధికారులు మిగతా తేల్చేస్తున్నారు. దీంతో బాధితులు అయోమయంలో పడ్డారు.
నగరంలోని భూములకు రిజిస్ట్రేషన్లు కాకపోవడంతో బ్యాంకర్లు లోన్లు ఇవ్వడంలేదు. లోన్లు రాకపోవడంతో స్థలాలు, ఇండ్ల కొనుగోళ్లు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలు స్థలం, ఇండ్లు కొనుగోలు చేయాలన్నా జంకుతున్నారు. అటు ఇప్పటికే ఇచ్చిన లోన్లు రికవరీ అవుతాయో లేదోననే ఆందోళనలో బ్యాంకులు ఉన్నాయి. ఆయా రిజిస్ట్రేషన్ కా ర్యాలయాల పరిధిలో సగానికి పైగా భూము లు నిషేధిత జాబితాలో ఉండటంతో రిజిస్ట్రేషన్లు పూర్తిగా తగ్గిపోయాయి. అపార్ట్మెంట్లు, కమర్షియల్ కాంప్లెక్స్‌లు, ఇండ్లు, ప్లాట్లకు పలు బ్యాంకులు రూ.కోట్లలో లోన్లు ఇచ్చాయి. మరికొన్ని స్థలాలు, ఆస్తులను మార్ట్‌గేజి చేసుకుని లోన్లు మంజూరు చేశా యి. సిటీలోని మెజారిటీ ఇండ్లు, భూములు, ప్రజల ఆస్తులను ప్రభుత్వం నిషేధిత జాబితాలో చర్చడంతో బ్యాంకర్లు తమ లోన్లు తిరిగి వస్తాయా? రావా? అనే సందిగ్ధంలో పడ్డాయి. ఇప్పటికే తమ కషార్జితంతో కొనుగోలు చేసిన ఇండ్లు, స్థలాలు, నిర్మాణాలను ఉన్నపలంగా నిషేధిత జాబితాలో చేర్చడంతో రెవెన్యూ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఈనేపథ్యంలో తమ ఆస్తులపై హక్కులను కోల్పోయి ఆందోళనలో ఉన్న ప్రజలు వాటిపై ఉన్న లోన్లు కడతారా? అనే మీమాంసలో బ్యాంకర్లు ఉన్నారు. ఇప్పటికే పలు అపార్ట్మెంట్లు నిషేధిత జాబితాలో ఉన్నట్లు తేలడంతో వాటిపై ఉన్న లక్షలాది రూపాయాల లోన్లు ఎలా తీర్చాలనే గందరగోళంలో బాధితులున్నారు. ఈ క్రమంలో తమ లోన్లు తిరిగి రావడం కష్టమేననే ఆందోళనలో బ్యాంకర్లున్నారు.
నిషేధిత జాబితా బాధితులు ఒక్కొక్కరు గా బయటకు వస్తున్నారు. చిత్ర విచిత్రమైన ఘటనలను ఎదుర్కొంటున్నారు. ఓ సీనియర్ జర్నలిస్టు ఇటీవల తన 20 ఏండ్ల ఉద్యో గ జీవితంలో సంపాదించిందంతా కూడబెట్టుకుని, ఇంట్లో ఉన్న బంగారాన్ని తాకట్టు పెట్టి, షేర్లు అమ్ముకుని, పీఎఫ్ డబ్బులు మొత్తం విడిపించుకుని రూ.45 లక్షలకు ప్లాట్ కొందామని అడ్వాన్స్ ఇచ్చారు. మిగిలిన డబ్బు సేల్ డీడ్ అయ్యాక లోన్‌కు దరఖాస్తు చేసుకున్నారు. యజమానితో జీపీఏ చేయించుకున్నారు. ఆ తర్వాత రెండు నెలల కు రిజిస్ట్రేషన్ చేయించడానికి బంజారాహిల్స్ సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయానికి వెళ్తే.. ఆ భూమి నిషేధిత జాబితాలో చేరింది. రిజిస్ట్రేషన్ కుదరదని తేల్చేశారు. ఇలా రోజుకో బా ధితుడి ఉదంతాలు బయటకు వస్తున్నాయి.
నిషేధిత జాబితా పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం, అధికార పార్టీ ప్రజాప్రతినిధులు, వాళ్ల అనునయులు కాసుల వేటకు తెరలేపినట్లు తెలుస్తున్నది. నిజమైన ప్రభుత్వ భూములను వదిలేసి దశాబ్దాలుగా రైతులు, మధ్యతరగతి ప్రజలు ఉంటున్న ఆస్తులను కావాలనే నిషేధిత జాబితాలో చేర్చి బేరసారాలతో భారీమొత్తంలో డ బ్బులు గుంజేందుకేనని తెలుస్తున్నది. పైరవీలు, ఎన్వోసీల పేరిట బాధితుల వద్ద గద్దల్లా వాలిపోయి లాయర్ల ఫీజులు, అధికారుల లంచాల రూపంలో కోట్లాది రూపాయలు కొల్లగొడుతున్నారు. బాధితులు కలెక్టర్లు, సబ్ రిజిస్ట్రార్ల చుట్టూ తిరగలేక ఎంతోకొంత ముట్టజెప్పి అత్యవసర పరిస్థితుల్లో లక్షలు పోగొట్టుకుంటున్నారు. అయితే ఈ దందా అధికార పార్టీ నేతల అనుచరులు, పెద్దల అనునయులే చేస్తున్నట్లు పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతున్నది.