హైదరాబాద్, నవంబర్ 30 (నమస్తే తెలంగాణ): గురుకుల విద్యార్థులు చనిపోతున్నా ప్రభుత్వం పట్టించుకోదా అని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. హాస్టళ్లపై ఇంత నిర్లక్ష్యం ఎందుకని నిలదీశారు. ఇకనైనా సీఎం రేవంత్‌రెడ్డి స్పందించాలని, గురుకులాల పనితీరుపై సమీక్ష నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం సీఎంకు లేఖ రాశారు. ‘ఈ విద్యా సంవత్సరంలో 42 మంది విద్యార్థులు చనిపోయారు. దాదాపు 1200 మంది విద్యార్థులు దవాఖాన పాలయ్యారు. కాబట్టి గురుకులాల సమస్యను రాజకీయ కోణంలో చూడకుండా తక్షణం చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని, ప్రజల్లో విశ్వాసం కలిగించేలా ప్రభుత్వం పనిచేయాలి. పాఠశాలలు, హాస్టళ్ల నిర్వహణపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించి సంస్కరణలు చేపట్టాలి’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. బీసీ హాస్టళ్లలో వరర్లను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ పోస్టును గ్రేడ్-1 గా అప్‌గ్రేడ్ చేయాలని కోరారు.