హైదరాబాద్, ఫిబ్రవరి 8 (నమస్తే తెలంగాణ): స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచాలని ఎంపీ, జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ఆయన శనివారం సీఎం రేవంత్ రెడ్డికి బహిరంగ లేఖ రాశారు. స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీ రిజర్వేషన్లను 20 శాతం నుంచి 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెడతామని చెప్పి మాటతప్పారన్నారు. కామారెడ్డి డిక్లరేషన్‌లో లోక్‌సభ ప్రతిపక్షనేత రాహుల్ గాంధీ జనాభా ప్రకారం బీసీ రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.
బీసీ రిజర్వేషన్లు పెంచడానికి ప్రభుత్వానికి ఉన్న అడ్డంకులు ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు. ఓ వైపు రిజర్వేషన్లు పెంచకుండా, మరో వైపు కులాల లెక్కలు తప్పుగా చూయిస్తూ సీఎం రేవంత్ ప్రజల దృష్టిని మరల్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు.
రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ అసెంబ్లీ చట్టం చేస్తే ఉన్న ఇబ్బందులు ఏమిటని ప్రశ్నించారు. న్యాయపరమైన చిక్కులు ఉంటే ఉమ్మడిగా పోరాటం చేసి సాధించుకుందాం అని పిలుపునిచ్చారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం 50శాతం సీలింగ్ అని చెప్పి తప్పించుకునే ప్రయత్నం చేయవద్దని హితవు పలికారు. ఇప్పటికే అగ్రకులాలకు 10శాతం రిజర్వేషన్లు పెట్టి 50శాతం సీలింగ్‌పై పార్లమెంటు రాజ్యాంగ సవరణ చేసిందని పేర్కొన్నారు.
అగ్రకులాలకు రిజర్వేషన్లు పెంచడానికి మూడు రోజులలో లోక్‌సభ, రాజ్యసభలో రాజ్యాంగ సవరణ చేసి రాష్ట్రపతి సంతకం చేశారని ఆయన గుర్తుచేశారు. కానీ 50శాతం జనాభా ఉన్న పేద కులాలకు రాజ్యాంగ సవరణ చేయరా..? అని ప్రశ్నించారు. అసెంబ్లీలో చట్టం చేసి 42 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చని, ఈ అంశంలో అన్ని పార్టీలు కలిసి రావడానికి సిద్ధంగా ఉన్నాయని స్పష్టం చేశారు. పార్లమెంట్లో రాజ్యాంగ సవరణ చేయాలని సూచించారు. లేని పక్షంలో గ్రామస్థాయి నుంచి ఉద్యమిస్తామని హెచ్చరించారు.