రవీంద్రభారతి, అక్టోబర్ 18/కాచిగూడ: ‘తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా శనివారం బీసీ బంద్ విజయవంతమైంది. నగరాలు, పట్టణాలు సహా గ్రామాల్లోనూ సంపూర్ణంగా బంద్ పాటించారు. బంద్‌కు మద్దతుగా నిలిచిన అన్ని రాజకీయ పార్టీలు, కుల, విద్యార్థి, ప్రజా సంఘాలకు కృతజ్ఞతలు’ అని ఎంపీ, బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఆర్ కృష్ణయ్య తెలిపారు. బీసీల ఆకాంక్షల మేరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దిగిరాక తప్పదని, ఆ మేరకు పోరుబాటకు రెండు మూడు రోజుల్లో కార్యాచరణ రూపొందిస్తామని చెప్పారు.
హైదరాబాద్ బషీర్‌బాగ్ దేశోద్దారక భవన్లో శనివారం బీసీ సంఘాల జేఏసీ వైస్ చైర్మన్ వీజీఆర్ నారగోని, కో-చైర్మన్ దాసు సురేశ్‌తో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. అన్ని జిల్లాల్లో ప్రజలు బంద్ సంపూర్ణంగా పాటించారని తెలిపారు. 135 బీసీ కులసంఘాలు, ఆర్టీసీ ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరూ బీసీ బంద్‌లో పాలుపంచుకున్నారని తెలిపారు. ఈ విజయాన్ని తెలంగాణ సకలజనులకు అంకితం చేస్తున్నామని ప్రకటించారు. బీసీలకు న్యాయమైన వాటా దక్కాలనే బలమైన సంకేతాన్ని ఈ బంద్ ద్వారా పాలకులకు ఇచ్చామని తెలిపారు.
బంద్ సమయంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా వ్యాపారులు, ఇతర అన్నివర్గాల ప్రజలు బీసీల కోసం మద్దతుగా నిలిచారని కొనియాడారు. సమావేశంలో బీసీ నేతలు గుజ్జ కృష్ణ, నీల వెంకటేశ్, భరత్‌కుమార్, కాంకోటి, రామ్‌దేవ్, బడేసాబ్ తదితరులు పాల్గొన్నారు. అంతకు ముందు బర్కత్‌పుర ఆర్టీసీ డిపో ఎదుట బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత గుజ్జ కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాను ఉద్దేశించి ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. బీసీ రిజర్వేషన్ల కోటాను సాధించే వరకు పోరాటాలను అపేది లేదని, రానున్న రోజుల్లో ఉధృతం చేస్తామని స్పష్టంచేశారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులు పాల్గొన్నారు.