చిక్కడపల్లి, ఆగస్టు 3: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కులగణన చేసి బీసీలకు చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్లు ఇవ్వకపోతే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య హెచ్చరించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ మంత్రులను, ప్రజాప్రతినిధులను తిరగనివ్వమని స్పష్టంచేశారు. బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో కులగణన, 42 శాతం రిజర్వేషన్ల పెంపు, షెడ్యూల్(9)లో చేర్పించడానికి అవసరమైన కార్యాచరణకు రాష్ట్ర అధ్యక్షుడు ఎర్ర సత్యనారాయణ అధ్యక్షతన శనివారం విద్యానగర్లోని బీసీ భవన్లో నిరసన దీక్ష చేపట్టారు.
ఆర్ కృష్ణయ్య, రిటైడ్ ఐఏఎస్ అధికారి చిరంజీవి, సమాజ్వాది రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ సింహాద్రి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన హామీ మేరకు 42 శాతం బీసీ రిజర్వేషన్లు పెంచిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కేంద్రం తక్షణం బిల్లు పెట్టాలని, లేకుంటే తామే ప్రైవేట్ బిల్లు పెట్టిస్తే ఈ ప్రభుత్వాలకు ఉనికి ఉంటుందా? అని ప్రశ్నించారు. సమావేశంలో బీసీ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, గుజ్జ సత్యం, కోలా జనార్దన్ తదితరులు పాల్గొన్నారు.