హైదరాబాద్, ఫిబ్రవరి 3(నమస్తేతెలంగాణ): ‘తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కుల గణన సర్వే అసమగ్రంగా ఉన్నది. హడావుడిగా సర్వేచేసి తప్పుల తడుకగా నివేదిక రూపొందించారు. బీసీల సంఖ్యను కావాలనే తగ్గించి చూపారు’ అని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య మండిపడ్డారు. పూర్తిస్థాయిలో సర్వే చేయకుండానే నివేదికను విడుదల చేయడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశారు.
సోమవారం ఢిల్లీలోని ఏపీ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో చేపట్టిన సమగ్ర కుటుంబ సర్వేలో బీసీల జనాభా 52% ఉన్నదని గుర్తుచేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన సర్వేలో 46 శాతానికి తగ్గించడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. బీసీల రిజర్వేషన్లను దెబ్బతీసేందుకే ప్రభుత్వం తప్పుడు లెక్కలు చూపిందని దుయ్యబట్టారు. ఈ విషయంపై సీఎం రేవంత్రెడ్డి స్పందించి బలహీనవర్గాలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.